రేపటి నుంచి ఎక్కడి నుంచైనా రేషన్‌ - MicTv.in - Telugu News
mictv telugu

రేపటి నుంచి ఎక్కడి నుంచైనా రేషన్‌

March 31, 2018

రేషన్ సరుకులు తీసుకోవడంలో చాలా మందికి చాలా రకాల ఇబ్బుందులు నెలకొని వున్నాయి. ఈ నేపథ్యంలో సివిల్ సప్లైస్ కమీషనర్ సీవీ. ఆనంద్ ఒక చల్లని వార్త చెప్పారు. ఇకనుంచి ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపారు. ఊళ్ళను విడిచి నగరాలకు వలస వచ్చిన చాలా మంది నెలనెల రేషన్ సరుకుల కోసం ఊళ్ళకు వెళ్ళాల్సి వచ్చేది. ఇకనుంచి ఆ ఇబ్బంది వుండదంటున్నారు. ఏ జిల్లా నుండి ఏ జిల్లాకు వలస పోయినా అక్కడే వేలిముద్ర పెట్టి రేషన్ పొందవచ్చు అంటున్నారు. కార్డు మార్చుకునే అవకాశం ఉండదు.. కార్డులో అడ్రస్ మార్చే అవసరం వుండదని తెలిపారు. ‘ 17000 షాపులలో ఎవరైనా ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇలాగైతే 85 లక్షలమంది కార్డుదారులకు లబ్ది చేకూరుతుంది. గత ఏడాది జూన్‌లోనే జీహెచ్ఎంసీలో 1550 షాపుల్లో ఈ సదుపాయం కల్పించాం. అద్బుతమైన ఫలితాలు వచ్చాయి. గత ఏడాది నుంచి ఈ పాస్ విధానం ప్రారంబించాం. 200 షాపుల్లో మాత్రమే కనెక్టివిటీ లేదు. ఫిబ్రవరి, మార్చిలో ప్రతీ జిల్లాలో పోర్టబులిటీ అందుబాటులోకి తెచ్చాం. ఇప్పటికే 5 లక్షల మంది ఈ సదుపాయాన్ని వాడుకున్నారు. వలస కూలీలకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగంగా వుంటుంది ’ అని అన్నారు.సొంతగ్రామాల్లో రేషన్ తీసుకునే అవకాశం లేక చాలా మంది ఇబ్బందులు ఎదురుకున్నారని చెప్పారు. ‘ డీలర్ల మధ్య కాంపిటీషన్ పెరిగింది. లబ్దిదారులతో డీలర్లు మర్యాదగా వ్యవహరిస్తున్నారు. సమయాపాలన కూడా పెరిగింది. ఉదయం ఐదుగంటలకు కూడా డీలర్లు షాపులను తెరచి ఉంచుతున్నారు. లైసెన్స్ సస్పెండ్ అయితే కూడా లబ్దిదారులకు ఇబ్బంది ఉండేది… ఇప్పుడు పక్క షాప్‌కు వెళ్ళి కూడా తీసుకోవచ్చు. దేశంలోనే పోర్టబులిటి అమలుచేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణకు పేరొచ్చింది. ఈ క్రమంలో పదిశాతం ఎక్కువ స్టాక్‌ను డీలర్ల వద్ద ఉంచుతున్నాం. ఈ నెలలో ఇరవై శాతం అదనపు స్టాక్ ఉంచుతున్నాం. స్టాక్స్ అయిపోతే ఈ పాస్ మిషన్‌లోనే స్టాక్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. కార్డు చివరి ఆరునెంబర్లు చెప్పి ఫింగర్ ప్రింట్ ఇస్తే చాలు రేషన్ సరకులు ఇస్తారు.డీలర్ల వద్దకు కార్డుకూడా తీసుకువెళ్ళాల్సిన అవసరంలేదు. ఒకటి నుండి పదిహేను వరకు డీలర్లకు ఎలాంటి సెలవులు ఉండవు.

నేషనల్ ఇన్ఫర్‌మేటిక్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును అమలులోకి తీసుకు వచ్చాం. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వేరే ప్రాంతాల్లో ఉన్నా ఎక్కడివారు అక్కడే తీసుకోవచ్చు. మరో 850 కొత్త షాపులు పెట్టాలని రిపోర్టు సిద్దం చేసాం ’ అని పేర్కొన్నారు.