కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ ఇంఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబు, ఎస్ఐ నాగ తులసీ ప్రసాద్‌లను అరెస్ట్ చేయాలంటూ మరోసారి డోన్ కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. గతేడాది హతుడు నారాయణరెడ్డి భార్య శ్రీదేవి డోన్ కోర్టులో పిటిషన్ వేశారు. అప్పుడు కూడా అరెస్ట్ వారెంట్ సిద్ధమైంది. కాగా డోన్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. శ్యాంబాబు హైకోర్టును ఆశ్రయించడంతో.. అరెస్ట్ వారెంట్‌పై స్టే వచ్చింది. ప్రస్తుతం ఆ స్టే గడువు ముగియడంతో.. డోన్ కోర్టు శ్యాంబాబు, ఎస్ఐలను అరెస్ట్ చేయాలని మళ్లీ ఆదేశించింది. ఈసారి వాళ్ళను అరెస్ట్ చెయ్యకపోతే పోరాటం కొనసాగిస్తామని శ్రీదేవి తరపు లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు.
2017లో హత్య జరిగింది…
ఏపీలో సంచలనంగా మారిన ఈ హత్య 2017లో జరిగింది. నారాయణ రెడ్డి ఓ పెళ్లికి వెళ్లి వస్తుండగా కృష్ణగిరి దగ్గర గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఓ కల్వర్ట్ వద్ద ట్రాక్టరుతో నారాయణ రెడ్డి వాహనాన్ని ఢీకొట్టారు. నారాయణ రెడ్డి అక్కడినుంచి తప్పించుకుని వెళ్తుండగా వేట కొడవళ్ళు, కత్తులతో, బాంబులతో దాడిచేసి హతమార్చారు. అయితే తన భర్తను డిప్యూటీ సీఎం కేఈ కుమారుడు శ్యాంబాబు అనుచరులతో కలిసి హత్య చేశారని నారాయణరెడ్డి భార్య శ్రీదేవి ఆరోపించారు. ఈ కేసు నుంచి హంతకులు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని శ్రీదేవి ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా అతనికి సహకరిస్తున్నారని చెప్పారు. శ్యాంబాబును ఛార్జ్‌షీట్‌లో నిందితుడిగా చేర్చలేదన్నారు. దీనిపై ఎస్పీని కూడా కలిసి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.