చిత్తూరులో ఘోరం.. సెప్టిక్ ట్యాంకులోకి దిగి ఏడుగురు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

చిత్తూరులో ఘోరం.. సెప్టిక్ ట్యాంకులోకి దిగి ఏడుగురు మృతి

February 16, 2018

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ కోళ్లపారానికి చెందిన సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేయడానికి అందులోకి  దిగిన ఏడుగురు కార్మికులు మృతి చెందారు. జిల్లాలోని పలమనేరు మండలం మొరంలో కోళ్లఫారం ఉంది. అందులో ఉన్నసెప్టిక్ ట్యాంకును శుభ్రం చేసేందుకు సమీప గ్రామాల నుంచి ఎనిమిది మంది కార్మికులు శుక్రవారం వచ్చారు.

అందులో ఏడుగురు సెప్టిక్ ట్యాంకు మూత తెరచి దిగారు. ఒకతను బయట ఉన్నాడు. సెప్టిక్ ట్యాంకులోకి దిగిన కొన్ని నిమిషాల్లోనే ఏడుగురు కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే గమనించిన యాజమాన్యం వారిని ఆస్పత్రికి తరలించింది. వారు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

కోళ్లఫారానికి చెందిన సెప్టిక్ ట్యాంకు చాలా ఏళ్ల నుంచి  మూసి ఉండడంతో  విషవాయువులు నిండిపోయాయి. వాటిని పీల్చకున్న కార్మికులు మృతి చెంది ఉంటారని వైద్యులుతెలిపారు. మృతుల్లో రమేశ్, రామచంద్ర, రెడ్డెప్ప,కేశవ, గోవిందస్వామి, రాములు, శివ ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కోళ్లఫారం యాజమానులను, మృతుల కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు.