సినిమా తీసేముందు కాస్తా జాగ్రత్తగా ఆలోచించాల్సిన కాలమిది. కులమతాలు, ప్రాంతాల ప్రాధాన్యం, కథలు ఉన్న సినిమాల సంగతైతే మరింత జాగ్రత్తపడాలి. ఎందుకంటే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో చెప్పలేం. సినిమాలో నవరసాలు బాగా పండాలని అందుకు తగ్గట్టు సన్నివేశాలు అల్లుకుంటే సరిపోదు. ఆ సన్నివేశాల వల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయో ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతో వుంది. సినిమా విడుదలైతేనే మనం చేసిన తప్పేంటో తెలుస్తుంది. ఇప్పుడు ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా పరిస్థితి అలాగే వుంది. అక్టోబర్ 11న విడుదలైన ఈ సినిమాకు కథ విషయంలో ఓ చిక్కు వచ్చిపడగా… తాజాగా రాయలసీమ గడ్డను దిగజార్చినట్టు సినిమా వుందని రాయలసీమ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాయల సీమ అంటే రక్త పాతం, హింస అన్న మాదిరిగా సీమను కించపరిచేలా ఈ సినిమాలో చూపించారని అన్నారు.
పంచ్‌ల కోసం త్రివిక్రమ్ సీమను వంచన చేస్తారా ? మా డీఎన్ఏలోనే రక్తపాతం వుందని పంచ్ డైలాగులు రాసిన దర్శక, రచయిత త్రివిక్రమ్ వెంటనే క్షమాపణ చెప్పి, ఆ డైలాగ్‌లను తొలగించాలని అంటున్నారు. ‘సీమ అంటే కేవలం పౌరుషం, రక్తపాతమేనా? ఇక్కడ కరువులు కాటకాలు లేవా ? జీవితాలు లేవా ? ఈ ప్రాంతంలో రెండు నదులు ప్రవహిస్తున్నా తాగడానికి నీళ్లు లేవు. ఇవేమీ వీళ్లకు కనిపించవా? వీటిపై సినిమాలు తీయడం చేతకాదా?
మా కరువు కథావస్తువు కాదా? మా ఆకలి కథా వస్తువు కాదా?
రాయలసీమ నుండి ఎంతో మంది కవులు, మేధావులు, స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారు. వాళ్లందర్నీ కాదని.. సీమ ప్రజలు అంటే కేవలం రక్తపిపాసిలుగా చూపించడం ఎంతవరకు కరెక్ట్ ? ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. అవేవీ చూపించకుండా సీమ ప్రజలపై ఫ్యాక్షనిస్టు ముద్ర వేస్తున్నారు’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాయలసీమ ప్రజా సంఘాల నేతలు.
నోటికొచ్చినట్లు డైలాగ్‌లు రాస్తే తాట తీస్తాం అంటూ రాయలసీమ విద్యార్ధి సంఘాలు హెచ్చరించాయి.
ఈ డైలాగులు తొలగించాల్సిందే…
– వయెలెన్స్ మీ డీఎన్ఏలోనే ఉంది.
– 30 ఏండ్ల నాడు మీ తాత కత్తి పట్టినాడంటే అది అవసరం.. అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం.. 10 దినాల నాడు అదే కత్తి నువ్ దూసినావంటే.. అది లక్షణం
– ఈ నేల కూడా కత్తిపట్టమని కోరతాంది.. తియ్ కత్తి.
-కడప కోటిరెడ్డి సర్కిల్ నుండి పులివెందుల పూల అంగళ్ళు దాక .. కర్నూల్ కొండారెడ్డి బురుజు నుండి అనంతపూర్ క్లాక్ టవర్ దాకా.. బళ్ళారి గనుల నుండి బెలగావ్ గుహల దాక.. తరుముకుంటూ వస్తా తల తీసి పారేస్తా.