నా 6 మాటల్లో 3 అబద్ధాలు వుంటాయా ? - MicTv.in - Telugu News
mictv telugu

నా 6 మాటల్లో 3 అబద్ధాలు వుంటాయా ?

March 17, 2018

6 మాటలు మాట్లాడితే నేను 3 అబద్ధాలే చెబుతానా? అంటూ జనసేన అధినేత పవన్ కల్యణ్‌ చేసిన ఆరోపణలపై ఏపీ ముఖ్యమంత్రి విసుర్లకు దిగారు. నాలుగేళ్లు మీకు మంచోడిగా కనిపించాను… ఇప్పడు చెడ్డోడిని ఎందుకు అయ్యానో అర్థం కావట్లేదు.. అలా అయితే నేను 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉండగలిగేవాడినా అని ప్రశ్నించారు. ‘ మా మాటల మీద నమ్మకం లేదా. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఎందుకు ? ప్రతి నియోజకవర్గానికి రూ.25 కోట్లు సర్దానని పవన్‌ చేసిన ఆరోపణల్లో నిజం లేదు. అవినీతిని నిర్మూలించాలంటే ముందు 1000, 500 నోట్లు రద్దు చేయాలని కేంద్రానికి నేను ప్రతిపక్షంలో ఉండగానే చెప్పాను.కేంద్రం నుంచి రూ.75,500 కోట్లు రావాలని తేల్చారు కదా… మరి ఆ నిధులు అడగకుండా నన్ను విమర్శిస్తే ఏమొస్తుందో పవన్‌ కల్యాణ్‌ సమాధానం చెప్పాలి ’ అని డిమాండ్ చేశారు.

రాజధాని నిర్మాణానికి 1500 ఎకరాలు చాలని పవన్‌ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మరింత ఘాటుగా స్పందించారు.. ‘1500 ఎకరాల్లో కూడా కట్టొచ్చు. కానీ ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు దక్కవు. మీరంతా (మండలి సభ్యులు) మంచి ఇళ్లు కట్టుకోవాలి గానీ ప్రజలకు మంచి రాజధాని అక్కర్లేదా ? వాళ్ళకు మంచి రాజధాని అందించడం ముఖ్యమంత్రిగా నా బాధ్యత ’ అని అన్నారు.‘మీ అబ్బాయి అవినీతి మీకు తెలుసా లేదా… లేక తెలిసే చేయిస్తున్నారా ’ అని పవన్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. తమ కుటుంబ సభ్యులమంతా ఎప్పటికప్పుడు ఆస్తుల వివరాలన్నీ ప్రకటిస్తున్నామన్నారు. ఈ దేశంలో ఎథిక్స్ కమిటీని తీసుకొచ్చిన ఘనత తనదేనని ఆయన వ్యాఖ్యానించారు. 1998లో ఎథిక్స్ కమిటీ తీసుకొచ్చి అందరి ఆస్తుల వివరాలు స్పీకర్‌కు, చైర్మన్‌కు ఇచ్చే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టానని చంద్రబాబు చెప్పారు. లోకేష్ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చారని, తాను ఎనిమిదేళ్ల నుంచే ఆస్తులను ప్రకటిస్తున్నానని పేర్కొన్నారు.