బ్యాంకులా ? బందిపోట్ల అడ్డాలా ?  8622 మోసాలు ! - MicTv.in - Telugu News
mictv telugu

బ్యాంకులా ? బందిపోట్ల అడ్డాలా ?  8622 మోసాలు !

February 22, 2018

పంజాబ్ బ్యాంక్‌ను నిండా ముంచిన నీరవ్ మోదీ బ్యాంకింగ్ వ్యవస్థను కోలుకోని షాక్‌కు గురి చేశాడు. కాగా గత మూడేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జరిగిన మోసాల సంఖ్యను రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ బ్యాంకుల్లో దాదాపు 8,622 మోసాలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్‌ శుక్లా నెలారంభంలో ఈ  లోక్‌సభకు రాతపూర్వకంగా వెల్లడించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో గడచిన మూడేళ్ళలో 471 కేసులు నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

2014-15 ఆర్థిక సంవత్సరంలో పీఎన్‌బీలో 180 కేసులు నమోదు కాగా, తర్వాతి ఆర్థిక సంవత్సరం 2015-16లో 131, ఆ తర్వాత 2016-17 మధ్య 160 కేసులు నమోదయ్యాయని శుక్లా ఓ ప్రశ్నకు సమాధానంగా లోక్‌సభకు వెల్లడించారు. దేశంలోని 21 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతి పెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మోసాల సంఖ్య అధికంగా వున్నట్టు సమాచారం. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐలో 893 కేసులు నమోదయ్యాయి. 2015-16లో 770 కేసులు, 2016-17లో 803 కేసులు నమోదయ్యాయి.

తర్వాతి స్థానంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఉంది. ఇందులో 2014-15 ఆర్థిక సంవత్సరంలో 303 కేసులు, తర్వాత సంవత్సరాల్లో వరుసగా 255, 224 కేసులు నమోదయ్యాయి. కాగా ఈ బ్యాంకు మోసాలకు సంబంధం వున్న 2,748 మంది బ్యాంకు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్టు శుక్లా తెలిపారు. 2016-17 సంవత్సరాల్లో 2,452 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు.  2014 నుంచి 2017 వరకు మూడు ఆర్థిక సంవత్సరాల్లో ప్రైవేటు రంగ బ్యాంకుల్లో 4,156కేసులు నమోదయ్యాయి. దీన్నిబట్టి  ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కన్నా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే మోసాలు ఎక్కువ జరగడం గమనార్హం.