ఈ దినకూలీ వార్షికాదాయం  40 లక్షలు.. ఎలా? - MicTv.in - Telugu News
mictv telugu

ఈ దినకూలీ వార్షికాదాయం  40 లక్షలు.. ఎలా?

January 30, 2018

ఏదైనా పెద్ద బిజినెస్సో, పెద్ద హోదాలో ఉద్యోగం చేస్తేనో లక్షలకు లక్షలు డబ్బు సంపాదిస్తారు. కానీ రోజూవారీ కూలీ చేసుకునే అతను సంవత్సరానికి రూ. 40 లక్షలు సంపాదిస్తున్నాడంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. కానీ ఈ కూలీ చాలా తెలివిగలవాడు. పక్కా లెక్కలతో ఐటీ రిటర్స్స్ కూడా ఫైల్ చేశాడు. ఇంతకీ ఈ కోటీశ్వర కూలీ పేరు ఏంటంటే రాచప్ప. బెంగుళూరు కనకాపుర రోడ్డులో నివాసముంటాడు. పోలీసుల కథనం ప్రకారం.. అతను చూపుతున్న ఐటీ రిటర్న్స్‌పై వారికి అనుమానం కలిగింది. కూలీ రాత్రింబవళ్ళు కష్టపడినా ఇంతలా సంపాదించరు. మరి ఇతనెలా సంపాదిస్తున్నాడని వెంటనే రంగంలోకి దిగారు. కరెక్ట్ లెక్కలతో రావాలని అతనికి ఆదాయపు పన్ను శాఖ వారు నోటీసులు పంపించారు. చివరికి వారి అనుమానమే నిజమైంది.

రాచప్ప ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేక తడబడ్డాడు. పోలీసుల రంగప్రవేశంతో అప్పగారి అసలు స్వరూపం బయట పడింది. వెంటనే పోలీసులు అతని ఇంటికి వెళ్ళి సోదాలు సాగించారు.  కిలో గంజాయి రూ.35వేల వరకు అమ్మి కోట్లాది రూపాయలు వేనకేసుకున్నాడు. కనకపురా రోడ్డులోని ఓ విలాసవంతమైన విల్లాలో అద్దెకు ఉంటున్నాడని తెలిసిన పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు.

అతని ఇంట్లో 26 కిలోల గంజాయితో పాటూ రూ. 5 లక్షల నగదు బయటపడింది. వెంటనే అతణ్ణి  అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో తన చీకటి బాగోతాన్ని బయటపెట్టాడు. బయటకు కూలీల కలరిస్తూ లోపల అతను చేస్తున్న గంజాయి దందా గురించి మొత్తం చెప్పుకొచ్చాడు. కూలీ పనుల కోసం పుష్పపురా నుంచి బెంగళూరు వచ్చిన రాచప్ప… దాదాపు ఐదేళ్లగా గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. సాషు అనే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి తెచ్చి… బెంగళూరులో అమ్ముతున్నట్లు విచారణలో తెలిపాడు.

తాను చేస్తున్న గంజాయి వ్యాపారానికి సహకరిస్తున్న మిగతా ముఠా సభ్యుల పేర్లు కూడా బయట పెట్టాడు. లాయర్ సలహాతోనే తాను ఇలా చేశానని… కాంట్రాక్టర్‌గా హోదాలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశానని తెలిపాడు. అతడిచ్చిన సమాచారంతో శ్రీనివాస్ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కూలీకి ఓ కారుతో పాటూ సొంత ఊరిలో భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్లు గుర్తించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న సాషు గురించి పోలీసులు గాలిస్తున్నారు. అతడు దొరికితే ఈ కేసులో మరిన్ని కీలక ఆధారాలు దొరకొచ్చంటున్నారు పోలీసులు.