అరుణాచల్ సీఎంపై అత్యాచారం కేసు! - MicTv.in - Telugu News
mictv telugu

అరుణాచల్ సీఎంపై అత్యాచారం కేసు!

February 16, 2018

అరుణాచల్ ప్రదేశ్‌ సీఎం పెమా ఖండు 8 ఏళ్ల కిందట తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ జాతీయ మహిళా కమిషన్( ఎన్సీడబ్ల్యూ )కు ఫిర్యాదు చేసింది. సీఎంతోపాటు మరో ఇద్దరు తనపై ఘాతుకానికి పాల్పడ్డారని  ఆరోపించింది. ఖండు ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్నారు. మహిళ ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ చట్టంలోని సెక్షన్ 10 కింద పెమా ఖండుతోపాటు మరో ఇద్దరు.. ఫుర్పా లామా తుంపీన్ టషి, దోర్జీ వాంగ్మూలంపై కేసు నమోదైంది.ఉద్యోగం కోసం వెళ్తే..

తనది వెస్ట్ సెయింగ్ జిల్లాలోని డోర్జెలింగ్ గ్రామమని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ‘ఉద్యోగం కోసం తవాంగ్ జిల్లాకు వెళ్లాను. మొదట  ఫుర్పా లామాను కలిశాను. నీకు ఉద్యోగం వెంటనే రావాలంటే నాకన్నా తోపులు వేరే వున్నారు. వాళ్ళను కలిస్తే పని అవుతుందని చెప్పటంతో సరేనన్నా. తర్వాత నన్ను తవాంగ్ సర్క్యూట్ హౌజ్‌కు తీసుకువెళ్ళాడు. అక్కడ కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి, స్పృహ కోల్పోగానే నాపై  ఒకరి తరువాత ఒకరు వరుసగా అత్యాచారం చేశారు..’ అని  వివరించింది.

స్పృహలోకి వచ్చాక పెమా ఖండు తనను తాను పరిచయం చేసుకుని చెంప మీద లాగిపెట్టి కొట్టాడని బాధితురాలు తెలిపింది. వీరిపై  ఇటానగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి తనకు ధైర్యం చాలలేదని, శక్తిని నింపుకోవడానికి ఏడేళ్లకు పైగా సమయం పట్టిందని చెప్పింది. ‘చాలా కాలంపాటు మానసిక వేదనకు గురయ్యాను. మొత్తానికి ధైర్యం తెచ్చుకుని ఫిర్యాదు చేశాను’ అని పేర్కొంది. ‘2015- 16 లలో ఫిర్యాదు చేశాను కానీ స్టేషన్ ఆఫీసర్ పక్కన పడేశారు. చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు కూడా వాదనను వినకుండానే కేసును కొట్టేసింది ’ తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి పెమా ఖండు స్పందించాల్సి వుంది.