ఆసిఫా బతికుంటే ఉగ్రవాది అయ్యేది.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆసిఫా బతికుంటే ఉగ్రవాది అయ్యేది..

April 14, 2018

అభంశుభం తెలియని ఎనిమిదేళ్ళ కాశ్మీరి చిన్నారిని అత్యంత కిరాతకంగా రేప్ చేసిన ఘటనపై దేశం మొత్తం అట్టుడుకుతోంది. ఇది చాలా దారుణం అని మానవత్వం వున్న ప్రతీ ఒక్కరు స్పందిస్తున్నారు. ఎనిమిదేళ్ళ పసిపాపను చిదిమెయ్యటానికి ఆ మృగాళ్ళకు మనసెలా ఒప్పిందని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కులమతాలకు, ప్రాంతీయతకు అతీతంగా ఆ రాక్షసులకు కఠిన శిక్ష వేయాలని నినదిస్తున్నారు. కానీ ఓ బ్యాంక్ మేనేజర్ మాత్రం అత్యంత అమానవీయంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అతని పేరు విష్ణు నందకుమార్. కొచ్చిలోని కొటక్ మహీంద్రా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజరుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.‘ ఆసిఫా ఎనిమిదేళ్ళకే చనిపోయి చాలా మంచిపని చేసింది. పెద్దయ్యాక తీవ్రవాది అయి బాంబులు పట్టుకొచ్చి ఇండియా మీద దాడి చేసేది ’ అని పోస్ట్ పెట్టాడు. జరిగింది అన్యాయం కాదు అన్నట్టు అన్యాయాన్ని సమర్థిస్తున్న అతని పోస్టుపై సర్వత్రా అతనిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మానవతా విలువలు మరిచిపోయి మృగాల మాదిరి ప్రవర్తించి అత్యంత పాశవికంగా ఓ పాపను చంపారన్న కనికరం లేకుండా పోస్ట్ పెట్టిన అతని మీద నెటిజనులు విరుచుకుపడుతున్నారు. అతని పోస్ట్‌ను తప్పుబట్టిన కొటక్ మహీంద్రా బ్యాంక్ విష్ణు నందన్ కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు ప్రకటించింది. ఆసిఫా మరణంపై మతం రంగును పులిమి కొందరు ఇలాంటి మాటలకు తెగబడటం సిగ్గుచేటు అంటున్నారు. విష్ణు కుటుంబంలో చాలా మంది ఆర్ఎస్ఎస్‌లో వున్నట్టు తెలుస్తోంది. కొందరు కేరళాలో బీజేపీ నాయకులుగా వున్నారు.