mictv telugu

సంగీత కచేరీపై సునామీ విధ్వంసం ఇలా (వీడియో)

December 26, 2018

ఇండోనేసియాలో సునామీ పెను విధ్వంసం సృష్టించి వందల మంది ప్రాణాలను బలితీసుకున్న విషయం తెిలసిందే.  శనివారం క్రాకటోవ్ అగ్నిపర్వతం పేలి సంభవించిన రాకాసి అలలతో కోస్తా తీరంలోని కార్తియా పట్టణం కకావికలమైంది.  490 మంది మృతి చెందగా.. 1600 మంది గాయాలపాలయ్యారు. మరో 150 మంది గల్లంతయ్యారు.

సునామీపై ప్రభుత్వం ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. దీంతో అనేక మంది అలల్లో చిక్కుకున్నారు. తీవ్ర ప్రాంతం పశ్చిమ జావాలోని తాంజుంగ్ లెసంగ్ బీచ్ రిసార్ట్ లో శనివారం రాత్రి ‘బ్యాండ్ సెవన్‌టీన్’ టీమ్ సంగీత కచేరీ నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా సునామీ వచ్చింది. సముద్రం ముందుకొస్తున్న విషయాన్ని ఎవరు గమనించలేదు. దీంతో వేదికపై ఉన్న కళాకారులతో పాటు కచేరీ చూసేందుకు వచ్చిన వేలాది మంది ప్రేక్షకులు సముద్ర అలల్లో చిక్కుకున్నారు.  

దీనిపై ఆ టీం ముఖ్య గాయకుడు రిఫియన్ ఫజాస్వా ఇన్‌స్టాగ్రామ్‌లో జరిగిన ఘోరాన్ని గుర్తు చేసుకుని కుమిలిపోయారు. తమ టీమ్‌లో వాద్యకారులైన యాండీ, హర్మన్, ఉజంగ్‌తో పాటు తన భార్య డైలాన్ సహారా సునామీలో గల్లంతయ్యారని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరోవైపు సునామీ బాధితులకు కనీస అవసరాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాగేందుకు నీరు, తినేందుకు తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు. చాలా మంది రోగాల భారీన పడుతున్నారు. ప్రభుత్వం పునరావాస సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎక్కడ చూసినా ప్రజలు సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. వేలాది మంది ప్రజలు ఇళ్లు వదిలి రోడ్లపైకి వచ్చారు.