కత్తులు దూస్తున్న నగరం… అత్తాపూర్ తరహాలో మరో హత్య.. జనాలది ప్రేక్షకపాత్రే - MicTv.in - Telugu News
mictv telugu

కత్తులు దూస్తున్న నగరం… అత్తాపూర్ తరహాలో మరో హత్య.. జనాలది ప్రేక్షకపాత్రే

October 7, 2018

ఈ నగరానికి ఏమంది ? నిత్యం రక్తపు మరకలేనా ? మనిషిని మనిషే చంపుకోవడం ఇక్కడ ఫ్యాషన్ అయిపోయిందా ? ఒక హత్య గురించి మరిచిపోక ముందే మరో హత్య జరుగుతోంది ? ఎందుకిలా ? చుట్టూ అంతమంది జనాలు వున్నా చోద్యం చూస్తారు తప్ప వాళ్ళేం చేస్తార్లే అనే ధీమా పెరిగిపోయి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారా ? మొన్న జరిగిన అత్తాపూర్ హత్య గురించి మరిచిపోక ముందే మళ్ళీ ఇంకొక హత్య చోటుచేసుకుంది. ఓ యువకుడ్ని గుర్తు తెలియని దుండగులు నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపారు. చుట్టూ జనం చూస్తుండగానే జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది. ఈ హత్యకు పాత కక్ష్యలే కారణం అని తెలుస్తోంది. స్థానికుల సమాచారం ప్రకారం…

Another type of Attapur style of murder

ఆదివారం ఉదయం పోట్లరాజు అనే వ్యక్తి నాగారం సెంటర్‌లో ఏదో పనిపై వెళుతున్నాడు. ఇంతలో  దుండగులు అతణ్ణి వెంబడించారు.

రాజు వారి నుంచి తప్పించుకుని కొంతదూరం వరకు పరుగెత్తాడు. అయినా వాళ్ళు అతణ్ణి వదిలిపెట్టలేదు.  వెంటాడి వేటాడి నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా నరికి చంపారు. అనంతరం దుండగులు వెంటనే అక్కడినుంచి పరారయ్యారు. స్థానికులంతా ఈ ఘటనతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో వున్నారు. పాత కక్ష్యలే ఈ హత్యకు ప్రధాన కారణం అని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.

రెండేళ్ళ క్రితం పగే…

రెండేళ్ల క్రితం రాజు, కృష్ణ అనే మరో యువకుడితో కొత్తూరు వెళ్లారు. తర్వాత కృష్ణ అనుమానాస్పద స్థితిలో రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. అయితే కృష్ణను రాజే చంపాడని భావించారు కృష్ణ బంధువులు. రాజుపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమధ్యే రాజు జైలునుంచి విడుదలయ్యాడు. ఈ క్రమంలో కృష్ణ కుటుంబం తమపై కక్షగట్టిందని భావించిన రాజు.. కుటుంబంతో సహా షాద్‌నగర్‌కు మకాం మార్చాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ నాగారం వచ్చాడని, హత్యకు గురయ్యాడని స్థానికులు చెబుతున్నారు.