అయోధ్యలోని రామ మందిరం భూ వివాదంపై విచారణ జరపాల్సిన అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ వైదొలిగారు. దీంతో ఈ నెల 29న కొత్త ధర్మాసనం ఏర్పాటు కానుంది. మొదట ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఏర్పాటైంది. గురువారం 20 నిమిషాల పాటు వాదనలు కొనసాగిన తరువాత జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ మాట్లాడుతూ తాను ఈ కేసు విచారణలో ఉండడంలేదంటూ ప్రకటించారు.గతంలో జస్టిస్ లలిత్ న్యాయవాదిగా ఉన్నప్పుడు బాబ్రీ మసీదు వ్యవహారానికి చెందిన కేసును వాదించారంటూ ఓ న్యాయవాది అనడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదట సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ మాట్లాడుతూ కల్యాణ్ సింగ్ ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబ్రీ మసీదు కూల్చివేత చోటు చేసుకుందని తెలిపారు. దానిపై దాఖలైన కేసు వ్యవహారంలో కల్యాణ్ సింగ్ తరఫున 1997లో లలిత్ వాదించారని చెప్పారు. అయితే ధర్మాసనం నుంచి జస్టిస్ లలిత్ వైదొలగాలని తాము కోరుకోవడం లేదని, నిర్ణయాన్ని ఆయనే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే విచారణ నుంచి వైదొలగుతున్నట్టు జస్టిస్ లలిత్ చెప్పారు. దీంతో మరో న్యాయమూర్తిని నియమిస్తూ కొత్త ధర్మాసనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది.