నటి త్రిష హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి ఇప్పడు స్త్రీ ప్రాధాన్యత గల సినిమాలే ఎక్కువగా చేస్తూ బిజీగానే వుంటోంది. అటు సినిమాలు చేస్తూ ఇటు అప్పుడప్పుడు సామాజిక అంశాలపైనా తనదైన శైలిలో స్పందిస్తూ వుంటుంది. ఇటీవల సుప్రీంకోర్టు సహజీవనం తప్పుకాదని చెబుతూ, గే సెక్స్ నేరం కాదని ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పి విమర్శల పాలైన సంగతి తెలిసిందే.
తాజాగా త్రిష మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కింది. ఈసారి కూడా సుప్రీం కోర్టు తీర్పుపైనే స్పందించింది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి అన్నీ వయసుల మహిళలు ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రజలనుంచి కొన్ని విమర్శలు, కొన్ని ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ క్రమంలో త్రిష స్పందిస్తూ… కోర్టు ఆదేశాలు స్త్రీలకు దక్కిన గౌరవమని పేర్కొంది. దేవాలయాలకు వెళ్ళేవారిని ఎవరినీ అడ్డుకోరాదని తెలిపింది. తాను నటించిన ’96’ ప్రమోషన్ కార్యక్రమాల్లో ఉన్న త్రిష, ఈ వ్యవహారాల గురించి తనకు పూర్తిగా తెలియదుగానీ, దేవాలయాలకు వెళ్లే ఎవరినీ అడ్డుకోరాదని తెలిపింది. ఆడవాళ్లు అయ్యప్ప గుడిలోకి వెళ్లడం ఎలా తప్పో తనకు అర్థం కావడం లేదని పేర్కొంది.