వికృత చేష్టల లిప్‌స్టిక్ బాబా అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

వికృత చేష్టల లిప్‌స్టిక్ బాబా అరెస్ట్

March 29, 2018

మొన్న నిత్యానంద స్వామి, నిన్న డేరాబాబా ఇవాళ లిప్‌స్టిక్ బాబా. దొంగ బాబాల బండారాలు బయట పడుతున్నా ఇంకా బాబాలు ఎక్కడోచోట అవతరిస్తూనే వున్నారు. భక్తి మాటున రక్తి కట్టిస్తున్న వారి ఆట కట్టిస్తున్నారు పోలీసులు. తాజాగా రాజస్థాన్‌లో ‘ లిప్‌స్టిక్ బాబా ’ గా సుపరిచితుడైన దైవాంశ సంభూతుడినని చెప్పుకునే కుల్దీప్ సింగ్ ఝాని పోలీసులు అరెస్టు చేశారు. ఆశ్రమంలోకి వచ్చే పురుష అనుచరులతో మైథూనం చేస్తున్నాడని అతనిపై ఆరోపణలు వచ్చాయి. అతని లైంగిక వేధింపులకు తాళలేక ఝలవర్‌‌‌కి చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు ఫిబ్రవరిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడనే ఆరోపణలు బాబాపై వచ్చాయి. మృతుడు యువరాజ్ సింగ్ తండ్రి సోహాన్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు బాబాను అరెస్టు చేశారు.పోలీసులు చేపట్టిన విచారణలో దాదాపు ఏడుగురు బాబా అనుచరులు బాబా గురించి చెప్పిన మాటలు దిమ్మ తిరిగేలా వున్నాయి. తమను సృష్టికి విరుద్ధమైన రీతిలో మైథూనం కోసం లైంగికంగా ఇబ్బందిపెట్టారని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. బాబా బాధితులందరూ పురుషులే కావడం గమనార్హం. ఆయనది గే మనస్తత్వం అన్నారు. దీంతో ఆయనపై వచ్చిన ఆరోపణల నిగ్గు తేల్చేందుకు బాధితులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

యువరాజ్ సింగ్ తండ్రి సోహాన్ సింగ్ మాట్లాడుతూ ‘ బాబా ఆశ్రమంలో జరిగే అన్ని క్రతువులకు మా కుటుంబం హాజరయ్యేది. బాబా నవరాత్రుల సమయంలో మహిళ వేషధారణతో దర్శనమిచ్చేవారు. ఆ సమయంలో లిప్‌స్టిక్‌ను బాగా వేసుకునేవారు. అది చూసి భక్తులు ఆయనకు లిప్‌స్టిక్ బాబాగా సంబోధించడం మొదలుపెట్టారు. నా కొడుకు ఓ యువతితో చనువుగా ఉంటున్నాడని తెలుసుకున్న బాబా అప్పటి నుంచి మావాణ్ణి వేధించడం మొదలుపెట్టారు. దాంతో వాడు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు ’ అని ఆవేదన వ్యక్తం చేశాడని పోలీసులు తెలిపారు.