దత్తాత్రేయ రాజీనామా! - MicTv.in - Telugu News
mictv telugu

దత్తాత్రేయ రాజీనామా!

September 1, 2017

కేంద్ర కేబినెట్ లో మరో కీలక పరిణామం.. కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ లు శుక్రవారం తమ పదవులకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కేంద్రంలోని మోదీ కేబినెట్  విస్తరణకు రెండు రోజుల ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది. గురువారం ఐదుగురు ప్రతాప్ రూడీ, ఉమాభారతి రాజీనామా చేయడం తెలిసిందే. నిర్మల సహా పలువురు మంత్రులు రాజీనామా బాటలో ఉన్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.  ఈ నెల 3న కేబినెట్ ను విస్తరించాలని మోదీ నిర్ణయించారు. దత్తాత్రేయ తప్పుకున్నారన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ నుంచి బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి లేదా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావులలో ఎవరికో ఒకరికి కేబినెట్లో చోటు దక్కే అవకాశముందని భావిస్తున్నారు. విశాఖ పట్నం బీజేపీ ఎంపీ కె.హరిబాము కూడా సహాయ మంత్రి పోస్టు దక్కనుందని సమాచారం. మైనింగ్ డాన్ జనార్దనరెడ్డి ప్రధాన అనుచరుడు బళ్లారి ఎంపీ శ్రీరాములును కూడా కేబినెట్లోకి తీసుకునే అవకాశముంది.  మరో మంత్రి అశోక్ గజపతి రాజుకు పదోన్నతి లభించొచ్చు. కేబినెట్ లోకి జేడీయూ, అన్నాడీఎంకేల ఎంపీలను తీసుకుంటున్నారని ఇదివరకే వార్తలు వచ్చాయి. వారికి చోటు కల్పించేందుకు పైన పేర్కొన్న మంత్రులతో రాజీనామాలు చేయించినట్లు భావిస్తున్నారు. గరిష్ట పాలన, కనిష్ట ప్రభుత్వం అని చెబుతున్న మోదీ.. తన కేబినెట్ మంత్రుల సంఖ్య తక్కువగా ఉండేందుకు పాత వారిని తప్పించి  కొత్తవారిని తీసుకుంటున్నారని పరిశీలకులు అంటున్నారు.

గవర్నర్ గా దత్తాత్రేయ !

దత్తాత్రేయను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా పంపే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళనాడు సహా పలు రాష్ట్రాలకు ఇన్ చార్జి గవర్నర్లు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ స్థానంలో మరొకరిని నియమిస్తారనే వార్తల నేపథ్యంలో దత్తన్నకు గవర్నర్ గిరీ దక్కొచ్చని భావిస్తున్నారు.