బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోకుండా కొత్త నిబంధన - MicTv.in - Telugu News
mictv telugu

బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోకుండా కొత్త నిబంధన

March 6, 2018

గతంలో కింగ్ ఫిషర్ యజమాని విజయ్ మాల్యా, కొద్ది రోజుల కిందట ఢిల్లీ వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీలు బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఓ సరికొత్త నిబంధనను తీసుకురాబోతోంది.  

ఇకముందు ఇలాంటివి పునరావృతం కాకుండా అడ్డుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. బ్యాంకుల నుంచి రూ.50 కోట్లకు పైగా రుణాలు పొందే వారి పాస్‌పోర్టు వివరాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించనుంది. రుణ గ్రహీతలు భారీ మొత్తాల్లో రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు ఇలాంటి చర్యలు దోహదపడగలవని ఆ శాఖ సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే తీసుకువచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.

లావాదేవీల పరంగా ఏదైనా ఖాతాపై అనుమానమొస్తే బ్యాంకులు ముందుగానే సంబంధిత ఏజెన్సీలకు తెలపవచ్చని తెలిపారు. వివిధ విభాగాలు సమాచారాన్ని ముందుగానే పంచుకోవడం వల్ల మోసగాళ్లు దేశం విడిచి పారిపోకుండా చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. బ్యాంకులు, నిఘా సంస్థలు, ఇతర ప్రభుత్వ విభాగాల మధ్య మరింత సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.