బాత్‌టబ్‌లో పడిపోతే చనిపోతారా? నిజమేనా? - MicTv.in - Telugu News
mictv telugu

బాత్‌టబ్‌లో పడిపోతే చనిపోతారా? నిజమేనా?

February 27, 2018

ప్రముఖ నటి శ్రీదేవి బాత్‌టబ్‌లోనే మునిగి చనిపోయినట్టు దుబాయ్ ఫోరెన్సిక్ నివేదికలు ధ్రువీకరించాయి. బోనీకపూర్ పెద్ద భార్య తరపు బంధువుల పెళ్ళికి వెళ్ళిన శ్రీదేవి పెళ్ళిలో ఆడిపాడి అంతలోనే బాత్‌టబ్‌లో పడి ఎలా చనిపోతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాత్‌టబ్ మరణాలు భారతీయులకు కొత్త కావచ్చునేమో గానీ విదేశాల్లో ఇలాంటి విషాదాలు సాధారణమే అంటున్నారు. ఇలాంటి మరణాలు దాదాపు మనదేశంలో చోటుచేసుకోవు కాబట్టి.. ఇదంతా విస్మయంగా ఉంటుంది. కానీ విదేశాల్లో ఇలాంటి విషాదాలు సాధారణమే. ముఖ్యంగా జపాన్‌, అమెరికాలో బాత్‌టబ్‌ మరణాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి.ఇలాంటి మరణాలు జపాన్‌లో ఏడాదికి 19 వేలు సంభవించినట్టు 2017 మార్చిలో జర్నల్ ఆఫ్ జనరల్ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ పత్రికలో ఓ కథనం ప్రచురించింది. గడచిన పదేళ్ళలో బాత్‌టబ్ మరణాలు 70 శాతం వరకు పెరిగాయంటున్నారు. ఈ మరణాల్లో ఎక్కువగా 65 ఏళ్ళకు పైగా వృద్ధులే వుంటున్నారని జపాన్ వినియోగదారుల వ్యవహారాల ఏజెన్సీ 2016లో పేర్కొంది.  జపనీయులు 41 సెల్సియస్‌కు పైగా వేడినీళ్లతో స్నానం చేయడం, బాత్‌టబ్‌ల లోతు ఎక్కువగా ఉండటం వల్ల ఇందుకు కారణం.అక్కడ ఇలాంటి మరణాలు జాతీయ విషాదంగా మారాయి.

ఇదిలా వుండగా 2015లో ఇళ్లలో ఉండే బాత్‌రూమ్‌లు ప్రమాదకరంగా మారాయని అట్లాంటాలోని సెంటర్‌ ఫర్‌ డీసిసెస్‌ కంట్రోల్‌ పేర్కొంది. 15 ఏళ్లకుపైగా ఉన్న రెండు లక్షలమంది ప్రతి ఏడాది బాత్‌రూమ్‌ గాయాలకు గురవుతున్నారని, అందులో 14శాతం మంది ఆస్పత్రి పాలవుతున్నారని తెలిపింది. 2006లో అమెరికా ఫెడరల్ మోర్టాలిటీ డాటా ప్రకారం బాత్‌టబ్, స్పా, హాట్‌టబ్ వంటి వాటివల్ల రోజుకొకరు మృతి చెందుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది డ్రగ్స్, మద్యం మత్తులో చనిపోతున్నారని తెలిపింది.