తెలంగాణ పువ్వుల పండుగ బతుకమ్మ ప్రపంచాన్నిఆకట్టుకుంటోంది. ఇప్పటికే తీరాలు దాటి విదేశాల్లోను బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలుగు ప్రజలు. ఇపుడు తాజాగా బిబిసి ఛానల్ కూడా బతుకమ్మ సంబరాలపై ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయనుంది. ఇందుకోసం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపి కవితతో పాటు పదివేల మంది మహిళలు ఇందుకోసం బిబిసి షూటింగ్లో పాల్గొననున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో గర్వించాల్సిన విషయం. కలర్‌ఫుల్ ఫ్లవర్ ఫెస్టివల్ బతుకమ్మ. ప్రపంచంలో పువ్వులను పూజించే ఏకైన పండుగ ఇదే. తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు నిదర్శనమైన బతుకమ్మ పండుగ తెలంగాణ ఉద్యమంలో కూడా భాగంగా పని చేసింది. ఇక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వమే పెద్దఎత్తున ఈ పండుగను జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయిస్తున్నది. గత ఏడాది బతుకమ్మకు ’గిన్నిస్ బుక్ రికార్డ్’ కూడా దక్కింది.
ఇలా అనేక ప్రత్యేకతలు ఉన్న బతుకమ్మ పండుగపై ప్రత్యేక కథనాన్ని రూపొందిస్తోంది బిబిసి. బిబిసి షూటింగ్ కోసం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 22న బిబిసి బృందం ఆర్మూర్‌లో బతుకమ్మ సంబరాలను చిత్రీకరించనున్నారు. ఎంపి కవిత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ చిత్రీకరణ జరుగనుంది. 10 వేల మంది మహిళలతో పాటు భారీ బతుకమ్మలను ఆర్మూర్‌లో తయారు చేయనున్నారు. సాంస్కృతిక బృందాలను కూడా బిబిసి షూటింగ్ కోసం రప్పిస్తుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే ఏర్పాట్లతో పాటు, తంగేడు పువ్వులతో పాటు రకరకాల పువ్వులను ఆర్మూర్‌కు తెప్పిస్తున్నారు జాగృతి నిర్వాహకులు.