mictv telugu

చన్నీళ్ల స్నానం చేస్తున్నారా? మంచిదేనా?

January 9, 2019

చన్నీటితో స్నానం చెయ్యాలంటే ఒళ్ళు జివ్వుమంటుంది. చలికాలంలో చన్నీటి స్నానం అంటే అస్సలు ఒప్పుకోరు. వేడినీళ్ల స్నానాన్నే ఎక్కువమంది ఇష్టపడతారు. అయితే చన్నీటి స్నానం వల్ల చాలా లాభాలున్నాయి అంటున్నాయి పరిశోధనలు.  చన్నీటిస్నానం చేస్తే బరువు తగ్గుతారట. రోజూ చన్నీళ్ల స్నానం చేస్తే ఏడాదికి నాలుగు కిలోల బరువు తగ్గుతారట. చల్లని నీళ్లవల్ల శరీరం వణుకుతుంది… అంటే కండరాల్లో కదలిక ఉంటుంది. ఫలితంగా అవన్నీ మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఇంకొన్ని క్యాలరీలు ఖర్చవుతాయి. అందుకే పాశ్చాత్య దేశాల్లో బరువు తగ్గడానికి ఐస్‌బాత్‌లకు వెళుతుంటారు.Telugu news Benefits with Cold bath scientists advise some precautions చన్నీటి స్నానం చేశాక శరీరం మళ్లీ వేడెక్కాలంటే మరిన్ని క్యాలరీలు కావాల్సివుంటుంది. శరీరంలోని వేడి పుట్టించడానికి కొవ్వు కరిగిపోతుంది. దీంతో జీవక్రియ వేగం పెరుగుతుంది.  చన్నీటి స్నానంతో లింఫటిక్‌ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది.చన్నీరు నేరుగా లింఫ్‌ రక్తనాళాలను ప్రభావితం చేస్తుంది. చన్నీటి స్నానం వల్ల ఒత్తిడికి కారకమైన హార్మోన్ల విడుదల తగ్గుతుంది. దాంతో ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. పైగా చర్మమూ జుట్టూ ఆరోగ్యంగా మృదువుగా ఉంటాయి.

శరీరంలో పేరుకున్న ఇన్ఫెక్షన్లు, టాక్సిన్లు, రసాయనాలన్నీ బయటకు పోతాయి. ఈ లింఫటిక్‌ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్లే చాలామంది తరచూ జలుబుబారిన పడుతుంటారు. రక్తప్రసరణ వేగంతో పాటు ఊపిరి తీసుకునే వేగం పెరుగుతుంది. ఫలితంగా శరీరంలో చురుకు పుడుతుంది.

గుండెవేగం పెరగడంతో శరీరంలోని అన్ని అవయవాలూ ఎక్కువ ఆక్సిజన్‌ పీల్చుకుంటాయి. దాంతో మొత్తంగా ఆరోగ్యం మెరుగవుతుంది. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. దేన్నయినా తట్టుకునే మానసిక దృఢత్వం కూడా చన్నీటి స్నానం చేసేవాళ్లలో ఎక్కువ. అయితే అన్నీ వేళల్లో చన్నీటి స్నానం మంచింది కాదంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా జ్వరాలు వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు చేయకపోవడమే మంచిది అంటున్నారు. చలికాలంలో చన్నీటి స్నానం అంటే ఒంట్లో తట్టుకోలేనంత వణుకు పుడుతుంది. కాబట్టి చలికాలంలో చన్నీటి స్నానానికి దూరంగా వుండటమే మంచిది.