బీజేపీకి భారీ  షాక్.. దూసుకెళ్తున్న కాంగ్రెస్, టీఎంసీ - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీకి భారీ  షాక్.. దూసుకెళ్తున్న కాంగ్రెస్, టీఎంసీ

February 1, 2018

అడుగు మోపిన చోటల్లా విజయ దుందుభి మోగిస్తూ అందలాలు అధిష్టిస్తోంది బీజేపీ . అయితే తాజాగా జరిగిన కీలక ఉపఎన్నికల్లో కమలం వెలవెలబోయింది.  రాజస్తాన్‌లో రెండు పార్లమెంట్‌ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి, పశ్చిమ బెంగాల్‌లోని ఒక పార్లమెంట్‌, ఒక అసెంబ్లీ స్థానానికి సోమవారం ఉప ఎన్నికలు జరిగాయి.

రాజస్తాన్‌లోని ఆల్వార్‌, అజ్మీర్‌ పార్లమెంట్ ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు దిశగా అడుగులు వేస్తోంది.  మందల్‌ఘడ్‌ అసెంబ్లీ స్థానంలో కూడా కాంగ్రెస్‌ అభ్యర్థి స్వల్ఫ ఆధిక్యంలో కొనసాగడం విశేషం. ఈ ఎన్నికల్లో ‘ పద్మావత్ ’ సినిమా సెగ బీజేపీకి తగిలిందనే వార్తలు వినిపిస్తున్నాయి.‘ పద్మావత్’  చిత్ర విషయంలో బీజేపీ ప్రభుత్వం రాజ్‌పుత్‌లకు అనుకూలంగా వ్యవహరించలేదన్న ఆగ్రహం రాజస్తాన్‌లో  ఆ వర్గం ఓటర్లను కాంగ్రెస్ వైపు తిప్పిందని అంచనా వేస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్‌లోని నౌపారా అసెంబ్లీ స్థానంలో తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందగా.. బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. బెంగాల్‌లోని ఉలుబేరియా లోక్‌సభ ఫలితాల్లో కూడా తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మెజార్టీతో గెలుపు దిశగా దూసుకుపోతున్నారు.

రాజస్తాన్ రాష్ట్రంలో ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలను బట్టి బీజేపీకి ఓటములు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.