ఎట్టకేలకు బిగ్‌బాస్ సీజన్2 చివరి అంకానికి చేరుకుంది. 18 మంది కంటెస్టెంట్స్‌లో ఎవరు విన్నర్ అవుతారోననే ఉత్కంఠకు తెరదిగింది. 113 రోజుల నుంచి బిగ్‌బాస్ అభిమానులు టీవీలకు అతుక్కుపోయి మరీ చూశారు. ఒక్కొక్కరు ఒక్కో కంటెస్టెంటును అభిమానించారు. తమ అభిమాన కంటెస్టెంటే బిగ్‌బాస్2 టైటిల్ గెలుచుకోవాలని కోరుకున్నారు. ఓటింగ్‌లు వేశారు. ఎస్ఎమ్ఎస్లతో తమ ఫేవరేట్ కంటెస్టెంట్‌ను గెలిపించుకోవడానికి ప్రయత్నించారు. మరి ఎవరి మిస్డ్ కాల్స్ వల్లనో, ఎవరి ఎస్ఎమ్ఎస్ల వల్ల ఎవరు గెలిచారనే దానికి నేటితో శుభంకార్డు పడింది.
గ్రాండ్ ఫినాలె ఎపిసోడ్ చాలా అట్టహాసంగా ప్రారంభమైంది. నాని స్టెప్పులతో అదరగొట్టాడు. ఆ తర్వాత ఎలిమినేట్ అయిన 13 మంది కంటెస్టెంట్ కూడా వచ్చి తమ డాన్సులతో అలరించారు. హౌజ్ లోపలున్న కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. హౌజ్ లోపలున్న ఐదుగురిలో తొలుత సామ్రాట్ ఎలిమినేట్ అయ్యాడు. అటుపై దీప్తి నల్లమోతు ఎలిమినేట్ కాగా, తర్వాత తనీష్ ఎలిమినేట్ అయ్యాడు. చివరగా హౌజ్‌లో మిగిలింది ఇద్దరే. వాళ్ళు కౌశల్, గీతా మాధురిలు. ఇంకా వాళ్ళిద్దరిలో ఎవరు బిగ్‌బాస్2 విన్నర్ అన్నదాని మీద చాలా ఉత్కంఠ నెలకొంది. ఇంట్లో వున్న వారిద్దరిలో కూడా చాలా ఎగ్జైట్మెంట్ నెలకొని వుంది.
చివరికి ఆ అంకం రానే వచ్చింది. నాని నోట బిగ్‌బాస్ విన్నర్ అనౌన్స్ అయింది. బిగ్‌బాస్ సీజన్2 విజేత కౌశల్ అని ప్రకటించగానే ఒక్కసారిగా అందరూ చప్పట్లతో అభినందించారు. తొలుత నుంచి కౌశలే విన్నర్ అవుతాడని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. ఎట్టకేలకు అదే నిజమైంది. కౌశలే విజయాన్ని అందుకున్నాడు. రన్నరప్‌గా గీతా మాధురి నిలిచింది. కౌశల్ విజయంలో కౌశల్ ఆర్మీ పాత్ర అమోఘమైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ సీజన్1 విజేత శివబాలాజీ కాగా సీజన్ 2 విజేతగా కౌశల్ నిలిచాడు.
తొలుత నుంచి ఇంట్లో ఎంతో ఓపికగా వున్నాడు కౌశల్. ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకుంటూ గేమ్ చాలా ప్లాన్డ్గా ఆడాడని అతనిమీద అభిమానం ఏర్పడింది. గీతా మాధురి కూడా చాలా చక్కని పర్ఫార్మెన్స్ కనబరిచిన కంటెస్టెంట్‌గా పేరు సంపాదించుకుంది.