మరుగుదొడ్డి నిర్మాణం కోసం బిక్షమెత్తుకుంది... - MicTv.in - Telugu News
mictv telugu

మరుగుదొడ్డి నిర్మాణం కోసం బిక్షమెత్తుకుంది…

February 13, 2018

ప్రభుత్వాలు ప్రతి అడుగు స్వచ్చత వైపు అంటూ ప్రజలను మేలుకొలుపుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణంపై టీవీల్లో తెగ ప్రకటనలు కూడా చేస్తున్నాయి. రాజకీయ నేతలు సైతం అంతే గొప్పలు చెబుతుంటారు. కానీ ఆదరణ మాత్రం శూన్యం. మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు ఇచ్చినా కూడా అవి పేదల వరకు చేరడం లేవు. ఆ నిధులన్నీ అధికారులే బకాసురులై తింటున్నారని ఓ మహిళ చేసిన పని అందరికీ చెంపపెట్టయ్యింది. అధికారులు నిర్లక్ష్యం వహించినా ఎలాగైనా మరుగుదొడ్డి నిర్మించుకోవాలనే తపనతో సాధించుకుంది. పేరుకు నిరుపేదరాలైన ఆమె మహిళా గౌరవానికి ఆదర్శంగా నిలిచింది. ఆమె చేసిన పనిని అందరూ అభినందిస్తున్నారు.

బిహార్‌లోని పతారా ఉత్తర్ గ్రామానికి చెందిన అమైనా ఖాతూన్ అనే మహిళ మరుగుదొడ్డి కోసం అధికారులకు దరఖాస్తు పెట్టుకుంది. ఆమె భర్త చనిపోవడంతో పాటు రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి చూసి కూడా కింది స్థాయి అధికారులు స్పందించలేదు. దీంతో ఆమె సమీప గ్రామాల్లో భిక్షమెత్తుకుని పైసా పైసా కూడబెట్టింది. మరుగుదొడ్డి నిర్మాణానికి సరిపడా డబ్బులు సమకూర్చున్న తర్వాతనే తన ఊర్లో మరుగుదొడ్డి నిర్మాణం పనులు ప్రారంభించింది.

ఆమైనా పట్టుదల గురించి తెలుసుకున్న కూలీలు, తాపీమేస్త్రి సైతం డబ్బులు తీసుకునేందుకు ఇష్టపడలేదు. ఉచితంగా ఆమెకు టాయిలెట్ నిర్మించి ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా ఆమె వినూత్న ప్రయత్నాన్ని అభినందిస్తూ సత్కారం చేశారు. కాగా తాను తొలుత బ్లాక్ స్థాయి అధికారుల దగ్గరకు వెళ్లి మరుగుదొడ్డి నిధుల కోసం దరఖాస్తు పెట్టుకున్నాననీ.. దాన్ని నిర్లక్ష్యం చేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్న అని అమైనా తెలిపింది.