మార్చి 31 నుంచి రైల్వేల్లో ఆహారపదార్థాలపై బిల్లులు తప్పినిసరి - MicTv.in - Telugu News
mictv telugu

మార్చి 31 నుంచి రైల్వేల్లో ఆహారపదార్థాలపై బిల్లులు తప్పినిసరి

March 21, 2018

రైలు ప్రయాణంలో ఖచ్చితంగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. కానీ రేట్లు మండిపోతుంటాయి. అయినా కడుపు మంటను చల్లార్చటానికి కొనక తప్పని పరిస్థితి. అడిగేవారు లేరని రైలు ప్రయాణీకులను బకరాలను చేసి దండుకుంటున్నారు రైల్వే క్యాటరర్స్. చాక్లెట్ల నుంచి మొదలు పెడితే న్యూస్‌పేపర్, వాటర్ బాటిల్, పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ ఇలా అన్నీ బయటకన్నా రెండూ, మూడు వంతులు ఎక్కువ రేటుకు విక్రయిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు వాళ్ళు. దీనిమీద సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఫిర్యాదులపై ఎట్టకేలకు అధికారులు స్పందించారు. గత ఏడాది ఆహార పదార్ధాల ధరల పట్టికను తెలుపుతూ ఐఆర్‌సీటీసీ ట్విటర్‌లో మెనూ కార్డును విడుదల చేసింది. అయితే రైళ్లలో మాత్రం ఆహార పదార్ధాలను అధిక ధరలకే విక్రయిస్తున్న తరుణంలో దీనిపై రైల్వే మం‍త్రి పీయూష్‌ గోయల్‌ విధాన నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణీకులకు బిల్లులు లేకుండా ఆహార పదార్థాలను విక్రయిస్తే వాటికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మార్చి 31 నుంచి రైళ్లలో ఈ పద్ధతి అమల్లోకి వస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.ఇకనుంచి ప్రయాణీకులకు బిల్లు ఇవ్వకుండా ఆహార పదార్థాలకు డబ్బులు వసూలు చేయటం కుదరదు. ప్రయాణీకులు కూడా తప్పక బిల్లు అడగాల్సిందే. లేదంటే బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదంటున్నారు. రైల్వే క్యాటరర్స్‌ అధిక చార్జీలను వసూలు చేస్తే పసిగట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆహార పదార్ధాలను అధిక ధరలపై విక్రయించడంపై ప్రత్యేక నిఘాకోసం ఇన్‌స్పెక్టర్లను కూడా నియమించనున్నట్టు సమాచారం. బస్‌స్టేషన్‌లలో కూడా ఈ రకమైన దోపిడీ యథేచ్ఛగా సాగుతోందని.. దీనిమీద కూడా ప్రభుత్వం స్పందిస్తే బస్సు ప్రయాణీకులకు కూడా మేలు జరుగుతుంది కదా అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.