అతని తల్లిదండ్రులు కూడా బిత్తిరి సత్తి అభిమానులే  - MicTv.in - Telugu News
mictv telugu

అతని తల్లిదండ్రులు కూడా బిత్తిరి సత్తి అభిమానులే 

November 28, 2017

 నిన్న బిత్తిరి సత్తిపై దాడి చేసిన మణికంఠ అనే యువకుడి  తల్లిదండ్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మి తన కొడుకు మానసిక స్థితి గురించి వివరణ ఇచ్చారు. సికింద్రాబాద్ కలాసిగూడాలో మణికంఠ అతని తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.

‘మా కొడుకు జర్నలిజంలో డిగ్రీ చేశాడు. ఆ తర్వాత సినిమాల్లో డైరెక్టర్ అవ్వాలని కలలు కన్నాడు. ఎక్కడా అవకాశాలు రావడంతో వాడి మానసిక స్థితి దెబ్బతిన్నది. ఈ క్రమంలో డ్రగ్స్‌కు బానిసయ్యాడు. డబ్బుల కోసం మమ్మల్నే అప్పుడప్పుడు కొట్టేవాడు. మానసిక నిపుణులకు చూపిద్దామనుకున్నాం.. అయినా వాడు మా మాట వినలేదు. ఈ నవంబర్ నెలలోనే  దాదాపు 15 మందిపై దాడి చేశాడు, ఈ క్రమంలోనే  వీ6 బిత్తిరి సత్తిపై దాడి చేశాడు. మేం కూడా బిత్తిరి సత్తి అభిమానులమే, రోజూ అతను చెప్పే వార్తలకోసం ఎదురు చూస్తాం.. మా కొడుకు సత్తిపై దాడి చేయడం మాక్కూడా చాలా బాధగా ఉంది’ అని మణికంఠ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

నిన్న సత్తిపై  దాడి చేయడంతో  బంజారాహిల్స్ పోలీసులు మణికంఠను  అరెస్ట్ చేశారు. ఈరోజు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, అతని మానసిక పరిస్థితి బాగాలేదని నిర్ధారణ అయితే, చికిత్సకోసం అతన్ని మెంటల్ ఆస్పత్రికి  తరలించే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు.