కాస్టింగ్ కౌచ్ ఎప్పటినుంచో వుంది... కృష్ణంరాజు - MicTv.in - Telugu News
mictv telugu

కాస్టింగ్ కౌచ్ ఎప్పటినుంచో వుంది… కృష్ణంరాజు

April 20, 2018

నటి శ్రీరెడ్డి  సినీ పరిశ్రమలో ‘కాస్టింగ్ కౌచ్ ’ ద్వారా అమ్మాయిల జీవితాలతో  కొందరు సినీ పెద్దలు ఆడుకుంటున్నారని తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా  నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు ‘కాస్టింగ్ కౌచ్’ గురించి స్పందించారు. సినీ పరిశ్రమలో ఈ విధానం ఎప్పటి నుంచో ఉందని కొత్తగా వచ్చిందేమి కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా కాస్టింగ్ కౌచ్ గురించి విన్నానని, ఈ విధానం కేవలం సినీ పరిశ్రమలో మాత్రమే లేదని,అన్ని చోట్లా ఉందని అన్నారు.అందరికీ విమర్శించడానికి సినీ పరిశ్రమే దొరికిందా? అని ప్రశ్నించారు. ఎక్కడో తప్పు జరిగిందని, మొత్తం వ్యవస్థనే తప్పుబట్టడం దారుణమని  అన్నారు. టాలీవుడ్‌లో ప్రస్తుతం జరుగుతున్నది తెల్ల పేపర్‌పై ఒక మచ్చ వంటిదని త్వరలోనే ఆ మచ్చను తొలగిస్తామని చెప్పారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ  దీక్ష చేపట్టడం విడ్డూరంగా ఉందని కృష్ణంరాజు అన్నారు. మోదీ దీక్ష చేసినప్పుడు విమర్శించిన చంద్రబాబు,ఇప్పుడు ఎలా దీక్ష చేస్తారని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఎంతో చేస్తోందని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని, ఇప్పుడు మాట మార్చడం దారుణమని అన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయాయని  కృష్ణంరాజు మండిపడ్డారు.