రక్తం చిందించిన  వర్మ ‘కడప’ ట్రైలర్ - MicTv.in - Telugu News
mictv telugu

రక్తం చిందించిన  వర్మ ‘కడప’ ట్రైలర్

December 15, 2017

‘ రాయలసీమ మగోళ్ళు అమ్మ కడుపులోంచే కత్తి పట్టుకొని పుడతారు – అక్కడివాళ్ళ నమ్మకం ’ అనే నానుడితో వర్మ కొత్త వెబ్‌సిరీస్ ట్రైలర్ విడుదలైంది. సైకిల్ చైన్ మీద ఒట్టేసి ఎట్లాగైనా ‘ కడప ’ వెబ్‌ సిరీస్ తీస్తా.. అన్నట్టుగానే 15న ట్రైలర్ విడుదల చేశాడు ఆర్జీవీ.

‘ అదే పనిగా పెట్టుకుంటే ఎవడినైనా చంపొచ్చు – ఫ్యాక్షనిస్ట్ రాజారెడ్డి ’ ఇందులో వున్న ఏ ఒక్క పాత్రా కల్పితం కాదు. కానీ ప్రాణభయం వల్ల పేర్లూ, వాళ్ళ ఊర్ల పేర్లు మార్చటం జరిగింది.. ఈ కథ నాకు తెలిసిన నిజం కాదు.. నూటికి నూరుపాళ్ళు ముమ్మాటికీ నిజం.. ఫ్యాక్షన్ అన్నది వెలిసింది సీమలో.. దానికి గుడి రాయలసీమ.. దానికి గర్భగుడి కడప.. ఇదే రాయలసీమ రెడ్ల చరిత్ర ’ అంటూ వర్మ తన వాయిస్ ఓవర్‌తో  కథను చెప్పేశాడు.

కడప పేరుమీదే గొడ్డలి, సుత్తి, కొడవలిని పెట్టి ఇది పక్కా రక్తాపాతాల వెబ్‌సిరీస్ అని చెప్పకనే చెప్పాడు.  ట్రైలర్ నిండా కత్తులతో వేటలు, మనుషుల్ని మటన్ నరికినట్టు నరకడాలు, రేపులు, పగలూ – ప్రతీకారాలు, బాంబు పేలుళ్ళతో సాంతం ఒళ్ళు గగుర్పొడిచే విధంగా వుంది ట్రైలర్. సినిమాకు సెన్సార్ వుంటుంది కానీ.. వెబ్‌కి సెన్సార్ లేదని వర్మ రెచ్చిపోయాడని,  పూర్తి స్వేచ్ఛ వుంది కాబట్టి వర్మ రాబోవు పూర్తి వెబ్‌సిరీస్‌లో రక్తాన్ని ఏరులై పారిస్తాడనే  కామెంట్లు వినిపిస్తున్నాయి.