కాసేపట్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడిపై ముష్కరులు కాల్పులు జరిపారు. పాతకక్షలో, మరే కారణాలో తెలియదుగాని ఈ దారుణం వల్ల పెళ్లిమండపంలో కాసేపు అలజడి రేగింది. అయితే పెళ్లికొడుకు గుండెదిటవుతో వ్యవహరించడంతో శుభాకార్యం పూర్తయింది. వరుడు భుజంలో దిగబడిన తూటా పెడుతున్న నొప్పిని భరిస్తూనే తాళి కట్టేశాడు.దేశరాజధాని ఢిల్లీలోని మదన్ గిరిలో సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. గుర్రంపై ఊరేగింపుగా వస్తున్న పెళ్లికొడుకు బాదల్‌పై మోటార్ సైకిళ్లపై వచ్చిన దుండగులు కాల్పులు జరిపి పారిపోయాడు. పెళ్లి వేదికకు 400 మీటర్ల దూరంలోనే ఈ దారుణం జరిగింది. బాదల్ భుజంలో తూటా దిగి, రెండు ఎముకల మధ్య ఇరుక్కుపోయింది. అతణ్ని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. మూడు గంటలు అక్కడే ఉన్నాడు. అయితే ముహూర్తానికి పెళ్లి కావాలన్న పట్టుదలతో బాదల్ భుజంలో తూటాతోనే పెళ్లిమండపానికి వచ్చాడు. వధువు మెడలో మంగళసూత్ర ధారణ చేసి తిరిగి ఆస్పత్రిలో చేరాడు. పెళ్లికొడుకు ధైర్యానికి పెళ్లి కూతురితోపాటు అక్కడికి వచ్చిన వారందరూ ఫిదా అయ్యారు.