రేప్‌కు ప్రతీకారంగా రేప్.. పాక్‌లో అనాగరికం    - MicTv.in - Telugu News
mictv telugu

రేప్‌కు ప్రతీకారంగా రేప్.. పాక్‌లో అనాగరికం   

March 29, 2018

మాటకు మాట.. చేతకు చేత అన్న నానుడిని పాకిస్తాన్ వాళ్ళు నిజం చేశారు. పడ్డ చోటే దెబ్బ కొట్టాలని అనుకున్నారు. కానీ అది దెబ్బ కొట్టినవాడిని తిరిగి కొట్టడం కాదు. అతని తాలూకు వారి మీద దెబ్బ కొట్టారు. ఇలాంటివి సామాన్యంగా సినిమాల్లో విలన్లు చేస్తుంటారు. హీరోను దెబ్బ తీయటానికి అతని వీక్‌నెస్ ఏంటో తెలుసుకొని కొడతారు. కానీ ఈ ఘటన అంతకన్నా దారుణమైంది. సభ్య సమాజం తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని ఘటన ఇది.ఈ దారుణ ఘటన తోబాతెక్ సింగ్ అనే గ్రామంలో జరిగింది. ఒంటరిగా కనిపించిన యువతిని ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. ఈ విషయమై ఆమె కుటుంబ సభ్యులు పంచాయితీ పెట్టారు. పెద్దల సమక్షంలో నిందితుడి కుటుంబ సభ్యులు ‘ మీ ఇంటి ఆడపిల్లను మావాడు రేప్ చేస్తే.. మా ఇంటి ఆడపిల్లను మీవాడు రేప్ చేసేస్తే.. చెల్లుకు చెల్లు అయిపోతుంది ’ అని చెప్పారు. టిట్ ఫర్ ట్యాట్ అంటే ఇదేనని చంకలు గుద్దుకున్న బాధితురాలి కుటుంబం కూడా సిగ్గులేకుండా అంగీకరించింది. తొలి అమ్మాయిని ఎక్కడ, ఏ గదిలో రేప్ చేశారో అదే గదిలో నిందితుడి సోదరిని బాధితురాలి సోదరుడి వద్దకు పంపారు రెండు కుటుంబాల పెద్దలు.

కామం కళ్ళకు ఎక్కిన కామాంధుడు చేసిన కీచక పర్వంలో ఏ పాపం ఎరుగని ఇద్దరు అమ్మాయిలు బలయ్యారు. అమ్మాయిలకు వ్యక్తిత్వం, మనస్తత్వం లేదన్నట్టే వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరించిన తీరు చాలా మందిని విస్మయానికి గురి చేస్తోంది. అన్న చేసిన తప్పుకు తన మానాన్ని సమర్పించుకోవాల్సిన పరిస్థితికి వచ్చిన చెల్లెలిపై సానుభూతిని చూపుతూ, పంచాయితీ పెద్దలను, రెండు కుటుంబాల వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాయి. నిందుతుణ్ణి నాలుగు తన్ని బుద్ధి చెప్పాల్సింది పోయి ఇంతటి సిగ్గుమాలిన పనికి ఒడి గడతారా అని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.