ప్రధాని పేరును గౌరవించలేదని జవాన్ జీతంలో కోత... - MicTv.in - Telugu News
mictv telugu

ప్రధాని పేరును గౌరవించలేదని జవాన్ జీతంలో కోత…

March 7, 2018

భద్రత దళానికి చెందిన  ఓ జవాన్ చేసిన చిన్న తప్పుకు అతనిపై వినూత్న పద్దతిలో చర్యలను తీసుకున్నారు. అతను చేసిన పొరపాటు.. దేశ ప్రధాని నరేంద్రమోదీ పేరుకు ముందు గౌరవనీయులైన లేదా శ్రీ అని సంబోధించడం జవాన్ మర్చిపోయాడు. దేశ ప్రధానిని అగౌరవపరిచాడని అతని జీతంలో కోతను విధించారు.ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ నడియాలోని మహత్‌పూర్‌లో గల బీఎస్‌ఎఫ్‌కు చెందిన 15వ బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్‌లో చోటుచేసుకుంది. రోజూవారీ జీరో పరేడ్‌లో  కవాతులో ఒక నివేదిక ఇచ్చే క్రమంలో కానిస్టేబుల్ సంజీవ్ కుమార్ మోదీ ప్రోగ్రామ్ అనే పదాన్ని ఉపయోగించాడు. దాంతో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కమాండెంట్ అనుప్ లాల్ భగత్ కానిస్టేబుల్ సంజీవ్‌పై క్రమశిక్షణ చర్యలను తీసుకున్నాడు. బీఎస్‌ఎఫ్ చట్టంలోని సెక్షన్ 40 కింద సంజీవ్ నేరం చేసినట్లు పరిగణించారు. దీనిలో భాగంగానే అతని నెల జీతం నుంచి ఏడు రోజుల వేతనాన్ని కట్ చేశారు. బీఎస్‌ఎఫ్‌లోని ఉన్నతాధికారులతో పాటు మిగతా భద్రతా దళాల అధికారులు అమప్‌లాల్ తీసుకున్న క్రమశిక్షణ చర్యను తప్పుపట్టారు. దీనిపై బీఎస్‌ఎప్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మ ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు.