ఆంధ్రప్రదేశ్ ఆగిపోయింది.. బడ్జెట్ బంద్ ఎఫెక్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆంధ్రప్రదేశ్ ఆగిపోయింది.. బడ్జెట్ బంద్ ఎఫెక్ట్

February 8, 2018

కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు తెల్లవారుజాము నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ మొదలైంది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంద్‌కు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బంద్‌కు మద్దతు పలికింది.  రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు.సీపీఐ, సీపీఎం నేతలు, బస్సులు బయటకు రాకుండా అన్నీ డీపోల ఎదుట బైఠాయించారు. రహదారులపై నిరసన తెలిపి ప్రైవేట్ వాహనాలను కూడా అడ్డుకోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. అత్యవసర వాహనాలు మినహా మరే వాహనాలు రహదారులపై కనిపించడం లేదు.రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం పార్టీలు, ప్రజాసంఘాలు ఏకతాటిపైకొచ్చి  బంద్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగానే తమ దుకాణాలను మూసివేశారు. తిరుమల, తిరుపతి డిపోల నుంచి బస్సులను బయటకు కదలనీయలేదు. ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. తిరుపతిలో కదం తొక్కిన వామపక్షాలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, భారీ ర్యాలీని నిర్వహించాయి.

విశాఖ జిల్లా వ్యాప్తంగా 695 బస్సులు నిలిచిపోయాయి. మద్దెలపాలెం వద్ద పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా ఏజన్సీ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. శ్రీకాకుళం, కడప, విజయవాడ ప్రాంతాల్లో పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు ప్రాంతాల్లో డ్రోన్‌లను ఉపయోగించి నిరసన ప్రదర్శనలను పోలీసులు చిత్రీకరిస్తున్నారు.