తూటాల రాక్షసుణ్ని అడ్డుకుంది.. శభాష్ శాంతి! - MicTv.in - Telugu News
mictv telugu

తూటాల రాక్షసుణ్ని అడ్డుకుంది.. శభాష్ శాంతి!

February 17, 2018

ప్రాణం మీదకు వచ్చినప్పుడు ఎంతో సమయస్ఫూర్తి అవసరం అని ఈమె చూపిన తెగువను తెలుసుకుంటే అర్థమవుతుంది. ఓవైపు తూటాల వర్షానికి విద్యార్థులు బలవుతున్నారు. ఆ సమయంలో తన సమయస్ఫూర్తితో చాలా మంది విద్యార్థులను కాపాడిన ఆ ఉపాధ్యాయురాలి పేరు శాంతి విశ్వనాథన్‌. ఆమె ఆ పాఠశాలలో గణితశాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.

ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌లోని మర్జోరీ స్టోన్‌మన్‌ డగ్లస్‌ పాఠశాలలోకి చొరబడిన 19ఏళ్ల క్రూజ్‌ విచక్షణారహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో దాదాపు 17 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. మరో 14 మంది గాయపడ్డారు. క్రమశిక్షణగా మెలగడం లేదని క్రూజ్‌ను పాఠశాల యాజమాన్యం సస్పెండ్‌ చేయడంతో కోపం పెంచుకున్న అతడు ఈ కాల్పులకు తెగబడ్డాడు.

 

క్రూజ్ తుపాకీ చేత బట్టుకొని పాఠశాల కారిడార్‌లో తిరుగుతూ కనిపించిన వారిని కనిపించినట్లు కాల్చి పారేస్తున్నాడు. ఈ ప్రమాదాన్ని గ్రహించిన భారతీయ అమెరికన్ ఉపాధ్యాయురాలైన శాంతి విశ్వనాథన్ భయపడకుండా చాలా తెలివిగా వ్యవహరించింది. బెదురుతున్న పిల్లలకు ధైర్యం చెప్పి, అరవొద్దంది. వెంటనే తరగతి గది తలుపులు, కిటికీలు బిగించి, పిల్లల్నందర్నీ కింద కూర్చోబెట్టింది. ఉన్మాది ఎప్పుడైనా తమ గదిలోకి రావొచ్చు.. అందరూ అప్రమత్తంగా, సంఘటితంగా వుండాలని చెప్పింది. చివరికి పోలీసులు వచ్చి తలుపులు బాదినా తీయలేదు.  గన్‌మెన్‌ గొంతు మార్చి అలా మాట్లాడి కాల్పులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నాడేమోనని భావించిన ఆమె తలుపు తీయనన్నారని పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు

కాల్పుల సమయంలో ఆమె చూపించిన సమయస్ఫూర్తి వల్లే తమ పిల్లలు ప్రాణాలతో ఉన్నారని లేదంటే.. ‘ మా పిల్లలు కూడా మాకు దక్కేవారు కాదు. ఆ టీచరమ్మకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే ’ అని ఓ విద్యార్థి తల్లి ఆనాటి సంఘటనను గుర్తు చేసుకుంది.