దొంగోడి కథ ఇలా అడ్డం తిరిగింది.. వీడియో చూడండి..

అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్ను ఇరుగుద్ది అంటరు.. నిజమే.. ఈ చోరుడు దొంగనాలకు కొత్తో.. లేక కంగారు పడ్డాడో తెలిదూ కానీ.. చోరీ చేయబోయి.. అడ్డంగా బుక్కయ్యాడు. థాయిలాండ్‌లోని ఛోన్‌బురి‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

27 ఏళ్ల సుఫాచై పథాంగ్ అనే వ్యక్తి  దొంగతనం చేయడానికి బంగారు ఆభరణాల దుకాణానికి వెళ్లాడు. మంచి గొలుసు చూపించమని అడిగాడు. ఎంచక్కా మెడలో వేసుకొని చూసుకున్నాడు. కొద్ది సేపు అటు ఇటు తిరిగాడు. అదే అదునుగా భావించి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. కానీ ముందుగానే అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన షాపు యజమాని.. దొంగ షాపులోకి రాగానే రిమోట్ కంట్రోల్‌తో డోర్ లాక్ చేశాడు. దీంతో దిమ్మదిరిగిపోయిన దొంగ తిరిగి వెనక్కి వచ్చి గొలుసును తిరిగిచ్చాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతణ్ణి అరెస్ట్ చేశారు. ఇదంతా షాపులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అయ్యోపాపం అంటూ కామెంట్లు పెడుతున్నారు.