లాకప్ డెత్‌పై భగ్గు..  పోలీస్ స్టేషన్‌కు నిప్పు.. - MicTv.in - Telugu News
mictv telugu

లాకప్ డెత్‌పై భగ్గు..  పోలీస్ స్టేషన్‌కు నిప్పు..

February 9, 2018

150 నుంచి 200 మంది ఒక్కసారిగా పోలీసు స్టేషన్‌‌ను ఘెరావ్ చేసి నిప్పు పెట్టిన ఘటన ఒడిశాలోని సంబల్ పూర్ జిల్లాలో జరిగింది. దొంగతనం కేసులో అరెస్టయిన వ్యక్తి లాకప్‌డెత్ అవటంతో, ఆ వ్యక్తి తాలూకు మనుషులు సంబల్ పూర్‌లోని అయినతపల్లి పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టి, నానా భీభత్సం సృష్టించారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈఘటనలో లక్షలాది రూపాయల ఆస్తినష్టం జరిగింది. స్థానికులు రోడ్డును దిగ్బంధం చేయడంతో అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడకు చేరుకోలేకపోయారు. దీంతో పోలీస్ స్టేషన్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది.

పోలీస్ స్టేషన్ ఆవరణలో వున్న కార్లను కూడా వదిలిపెట్టకుండా మంటలకు ఆహుతి చేశారు. కొందరు ఆందోళనకారులు పోలీసులపై రాళ్ళు రువ్వారు. కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగటంతో పోలీసులు లాఠీచార్జి జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

భలుపలి గ్రామానికి చెందిన అవినాష్ ముండా అనే వ్యక్తిని దొంగతనం కేసులో గత బుధవారంనాడు పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. గురువారం నాడు అతను లాకప్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఇది ఖచ్చితంగా పోలీసుల పనే అంటున్నారు మృతిని కుటుంబ సభ్యులు. అతని ఒంటి మీద తీవ్ర గాయాలున్నట్టు వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని సంబల్‌పూర్ ఎస్పీ సంజీవ్ అరోరా తెలిపారు.

సంజీవ్ అరోరా సహా పోలీసు సీనియర్ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించి… 7 ప్లటూన్ల పోలీసు దళాలను మోహరించారు. ఈ ఘర్షణలో గాయపడిన సుమారు 30 మందిని ఆసుపత్రులకు తరలించారు.