పశువులను కొన్నట్టు కొంటున్నాడు - MicTv.in - Telugu News
mictv telugu

పశువులను కొన్నట్టు కొంటున్నాడు

October 17, 2017

కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఫ్యాను గాలిని వదిలి, సైకిల్ ప్రయాణానికి సిధ్దమయ్యారు, ఈ సందర్భంగా ఆమె తన అనుచరులతో కలిసి మంగళవారం చంద్రబాబును కలిశారు. అయితే బుట్టా రేణుక పార్టీ మారడంపై  వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారది మండిపడ్డారు. ‘ఇన్నిరోజులు ఫ్యాను గాలిలో చల్లగ కూర్చుని,  ఎంపీ సీటు గెలిచిన తర్వాత, ఏమి ఆశించి ఆమె సైకిలెక్కుతున్నారో చెప్పాలి.. రాజకీయంగా అనుభవం లేకపోయినా ఎంపీ టికెట్‌ ఇచ్చి, బుట్టా రేణుకను జగన్ గెలిపించారు… ప్యాకేజీలకు ఆశపడే పార్టీ మారారా?‘ న అని సూటిగా  ప్రశ్నించారు.

‘నైతిక విలువలను చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కాడు, పశువులను కొంటున్నట్లు ఎమ్మెల్యేలు, ఎంపీలను కొంటున్నాడు. సిగ్గులేకుండా కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలు, పాలనా వైఫల్యాలను పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ ప్రజలకు వివరిస్తారు’ అని  పార్థసారథి తెలిపారు.  అయితే చంద్రబాబును కలిసిన బుట్టా రేణుక మాత్రం, అభివృద్ధికోసమే తాను టీడీపి మద్దతు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. రేణుక చేరిన తర్వాత మరికొందరు కర్నూలు నేతలు టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఆమె కర్నూలులో పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇటీవలి నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా బుట్టా రేణుక  టీడీపీ తరుపున ప్రచారం చేశారు.