బతుకమ్మ చీరలకు  బకెట్లు, బాసాన్లు  - MicTv.in - Telugu News
mictv telugu

బతుకమ్మ చీరలకు  బకెట్లు, బాసాన్లు 

October 31, 2017

బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, ఆడపడుచులకు పండగ కానుకగా పంపిణీ చేసిన చీరలు ఎంత వివాదాస్సదమయ్యాయో  అందరికీ తెలిసిన ముచ్చటే. ప్రతిపక్షాలు ఎంత పెద్ద దుమారాన్ని రేపాయో తెలిసిందే. ప్రభుత్వానికి చెడ్డపేరును కూడా తీసుకువచ్చాయి. కాగా ఈ చీరలు ఇప్పుడు చిరు వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

మహిళలు వాటిని అమ్మేసి ఇంట్లో వంట సామాన్లు కొనుక్కుంటున్నారు. తెలంగాణ పక్క రాష్ట్రం మహారాష్ట్రలోనే ఈ చీరలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. వస్తు మార్పిడి పద్ధతిలో చీరలకు బదులు బుట్టలు, బకెట్లు, బగోనెలు అంటగడుతున్నారు. మహారాష్ట్ర వ్యాపారులు మాత్రం ఒక్కో చీరకు రూ. 50, రూ. 60కి మించి వెల కట్టడం లేదు. ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాల నుంచి చీరలను తీసుకెళ్తున్నారు వ్యాపారులు.

ఇక్కడ సేకరించిన చీరలను మరాఠీ మహిళలకు రూ.200కు అమ్ముకుంటున్నారట. బతుకమ్మ పండగ సందర్భంగా అత్యంత అట్టహాసంగా,  కోటీ 45 లక్షల మంది ఆడపడుచుల కోసం  రూ. 220 కోట్లకు పైగా బతుకమ్మ చీరలకోసం  తెలంగాణా ప్రభుత్వం వెచ్చించింది.