mictv telugu

ఆగని నోట్ల ప్రవాహం.. జూపూడి ఇంటివద్ద క్యాష్ బ్యాగులు…

December 6, 2018

రోజు గడిస్తే ఓట్లు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి లీడర్లు చివరివరకూ పోరాడతామన్నంత పనే చేస్తున్నారు. డబ్బులు పంచొద్దని ఈసీ కఠిన నిబంధనలు జారీచేసినా దొడ్డిదారిన డబ్బులు పంచడానికి సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు‌ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. బుధవారం రాత్రి 9:30 గంటలకు ఓ ఇన్నోవా కారులో ముగ్గురు వ్యక్తులు జూపూడి నివాసానికి వచ్చారు. అక్కడే ఉన్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చారు. ఇంతలో ఆ ముగ్గురు వ్యక్తులు బ్యాగులతో జూపూడి ఇంటి వెనకాల గోడ దూకి పారిపోసాగారు. సినీఫక్కీలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వారిని వెంబడించి ఒకరిని పట్టుకున్నారు.Telugu news Cash bags at the house of Chairman of the Andhra Pradesh SC Corporation joopudi prabhakara raoఇద్దరు పారిపోయారు. పట్టుబడిన వ్యక్తి దగ్గర రూ.17.50 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన ఆ ఇద్దరు వ్యక్తుల వద్ద భారీ ఎత్తున నగదు ఉందంటూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు జూపూడి నివాసం ఎదుట ధర్నాకు దిగారు. ఓటర్లకు పంచేందుకే ఈ నగదు తీసుకొచ్చినట్లు వారు ఆరోపిస్తున్నారు. ఇదిలావుండగా వరంగల్ అర్బన్ జిల్లాలో రూ.3 కోట్లకు పైగా భారీగా నగదు పట్టుబడింది. సిద్దార్థ్‌నగర్‌లో ఆ డబ్బును పోలీసులు సీజ్ చేశారు. నోట్ల కట్టలతో పాటు ఓటరు స్లిప్‌లు పోలీసులకు లభించాయి. పట్టుబడిన నగదు వర్ధన్నపేట అభ్యర్థి పగిడిపాటి దేవయ్యకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. దీంతో ఎన్నికల కమిషన్ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. గ్రామాలతో పాటు అన్ని ప్రధాన రహదారుల్లో తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.