వంద ఎలుకల్ని తిన్న పిల్లి పుణ్యం కోసం కాశీకి వెళ్లినట్టు.. - MicTv.in - Telugu News
mictv telugu

వంద ఎలుకల్ని తిన్న పిల్లి పుణ్యం కోసం కాశీకి వెళ్లినట్టు..

March 7, 2018

‘ సౌ చూహోంకో ఖాకే బిల్లి హజ్‌కో నిక్‌లీ కతే.. ( వంద ఎలుకల్ని తిన్న పిల్లి పుణ్యం కోసం కాశీకి వెళ్లినట్టు )   అన్నట్టుంది కాంగ్రెసోల్ల వ్యవహారం చూస్తుంటే. ఇన్నిరోజులు పాపాలు చేసి ఆ పాపాలు కడుక్కోవడానికి బస్సుయాత్ర చేస్తున్నట్టే వుంది ’ అని మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. కోదాడ ప్రగతి సభలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చేపట్టిన బస్సుయాత్రపై ఆయన తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ‘ టీఆర్ఎస్‌ది ఉడుంపట్టు అని కాంగ్రెస్‌కు తెలుసు. అరవై ఏండ్ల పాలనలో కాంగ్రెస్ నాయకులు ఆంధ్ర నాయకులకు తొత్తులుగా మారి, వారి మోచేతి నీళ్ళు తాగి, తెలంగాణ ప్రజల కొంపలు ముంచారు. ఇప్పుడేదో తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తామన్నట్టు బస్సుయాత్రను ముందేసుకున్నారు.కాంగ్రెస్ వాళ్ళు తాము పెద్దవాళ్లం అంటారు. ఎలాపడితే అలా విమర్శలు చేయొద్దంటారు. వాళ్ళెలా పెద్దవాళ్లో నాకిప్పటికీ అర్థంకాదు. తెలంగాణను నట్టేట ముంచినందుకు వాళ్ళను పెద్దవాళ్ళనాలేమో. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోసం ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే మా హయాంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. రైతులకు రూ. 5 లక్షల ఉచితభీమా సౌకర్యం కల్పించాము. వేలమందిని బలిగొన్న నాయకులు, ఓ నలబై మంది బస్సెక్కి ఓ దిక్కుమాలిన యాత్రకు బయలుదేరారు ’ అని కేటీఆర్ మండిపడ్డారు.