రైతుకు అండగా నిలిచిన ఆర్మూర్ యువకుడికి కేంద్ర అవార్డ్ - MicTv.in - Telugu News
mictv telugu

రైతుకు అండగా నిలిచిన ఆర్మూర్ యువకుడికి కేంద్ర అవార్డ్

March 28, 2018

ఆరుగాలాలు ఎండనకా, వాననకా చెమట ధారపోస్తూ ఎనుపలా కష్టపడి అన్నం పెట్టే రైతన్నకు అండగా నిలవటమే తన ఆశయం అనుకున్నాడో యువ ఇంజనీర్. రైతు గోసలను ప్రభుత్వాలే పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్న తరుణంలో అతను వారికి తన మేథస్సుతో అండగా నిలిచాడు. తక్కువ ఖర్చుతో 45 హెచ్‌పీ కలిగిన హార్వెస్టర్‌ను తయారుచేసి వారికి ఆపద్బాంధవుడు అయ్యాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో పుట్టాడీ మట్టిలో మాణిక్యం. అతనిపేరే రవికిరణ్ గౌడ్. చదువుకున్నావారు వ్యవసాయరంగం వైపు అడుగులు వెయ్యాలి గానీ ఆ రంగం ప్రపంచంలోనే ఏ రంగమూ సాధించినంత అభివృద్ధి సాధిస్తుందని రవికిరణ్ ప్రయోగం చూశాక తెలుస్తుంది.  తక్కువ ఖర్చుతో రవికిరణ్ గౌడ్ ఈ యంత్రాన్ని తయారుచేశాడు. అతని కృషిని గుర్తించిన కేంద్ర సర్కార్ ‘ యాంత్రీకరణ్ సమ్మాన్ ’ అవార్డును ప్రధానం చేసింది.ఇటీవల ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధాసింగ్, మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్ర చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నాడు. రవికిరణ్ గౌడ్ తాను తయారుచేసిన యంత్రం గురించి వివరిస్తూ.. ‘ ఈ యంత్రంతో ఎకరానికి రూ.3 వేల ఖర్చుతో 0.01 శాతం వేస్టేజీతో మిగులు దక్కుతుంది. ఇప్పటివరకు వున్న యంత్రాలతో రైతులకు ఎకరానికి రూ. 8 వేల ఖర్చు అయ్యేది. రైతుకు 60 శాతం మాత్రమే మిగులు దక్కేది. ఇకనుండి ఆ దుబారా వుండదు. పోస్ట్ హార్వెస్టింగ్ యంత్రానికి ఈ పరికరాన్ని రూపొందించాను ’ అని తెలిపాడు.రవికిరణ్ హైదరాబాద్‌లో బీటెక్ మెకానికల్ ఇంజీనీరింగ్ చదివి యూకే వెళ్ళి అక్కడ ఆటోముబైల్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ చేశాడు. వ్యవసాయం రంగంలో యంత్రాలు, పనిముట్లు వినియోగం తక్కువగా వుండటం, కూలీల కొరతతో రైతులు ఇబ్బంది పడటం గమనించి ఈ కార్యానికి పూనుకున్నట్టు తెలిపాడు. ఒకటిన్నర సంవత్సరం పాటు జంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యవసాయ యంత్రాలు, పరికరాల మీద అధ్యయనం చేశాడు. ప్రత్యేకించి వరికోత యంత్రం తయారీ, వినియోగం, ప్రయోజనాలపై లోతుగా రీసెర్చ్ చేసి 45 అశ్విక శక్తిగల వరికోత యంత్రాన్ని రూపొందించిన ప్రప్రథమ యువకుడిగా రికార్డును సొంతం చేసుకున్నాడు. అలాగే రవికిరణ్ విద్యుత్ ఛార్జింగ్‌తో నడిచే ఎలక్ట్రికల్ రిక్షాను తయారుచేశాడు. ఈ రిక్షాకు 8 గంటలు ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్లు పోతుందని తెలిపాడు. డ్రైవర్‌తో ఆరుగురు కూర్చోవటానికి వీలుగా ఈ రిక్షాను తయారు చేసినట్టు తెలిపాడు. రైతులు వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళటానికి, గడ్డి ఇతర సామాగ్రి తేవటానికి , కూరగాయలను మార్కెట్‌కు తరలించటానికి, కూలీలను తోటకు తీసుకువెళ్ళటానికి ఈ రిక్షా ఉపయోగపడుతుందని వెల్లడించాడు.