‘ప్లీజ్ నాన్న..నన్ను చంపద్దు’ అన్నా వినలేదు ఈ కిరాతకుడు ! - MicTv.in - Telugu News
mictv telugu

‘ప్లీజ్ నాన్న..నన్ను చంపద్దు’ అన్నా వినలేదు ఈ కిరాతకుడు !

January 30, 2018

నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని చందానగర్లో జరిగిన కుటుంబ హత్యల్లో కీలక విషయాలు బయటపడ్డాయి. జీవితాంతం తోడుంటాను, పెళ్లి చేసుకుంటాను అని నమ్మబలికిన మధు అనే వ్యక్తే ముగ్గురిని హత్య చేశాడు. పదేళ్ల క్రితం అపర్ణకు మధు  అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీనితో ఒకరినొకరు ఇష్టపడ్డారు. జీవితాంతం తోడుంటానని చెప్పి మధు అపర్ణ ద్వారా ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. కానీ ఆతర్వాత కుటుంబాన్ని పట్టించుకోవడమే మానేశాడు.

 

ఎందుకంటే మధుకి పెద్దలు పెళ్లి చేసిన భార్య ఉండటమే కారణం. మధు పట్టించుకోక పోవడంతో అపర్ణ ఉద్యోగం చేసుకుంటూ తల్లితో కలిసి చందానగర్లోని గౌతమీనగర్లో కిరాయి కుంటూ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకుంటోంది. కానీ మధు అప్పుడప్పుడూ వస్తూ ఉండేవాడు. అయితే వీళ్ల సహజీవనం గురించి మధు భార్యకు అనుమానం వచ్చింది. అతనికి ఇదివరకే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈవిషయం తెలిస్తే భార్యతో లేనిపోని గొడవలు అనుకున్న మధు అపర్ణను ఆమెకు పుట్టిన బిడ్డను చంపాలనుకున్నాడు.

శుక్రవారంరోజు అపర్ణ ఇంటికి వెళ్లాడు. ఆసమయంలో అపర్ణ ఇంట్లో లేదు ఉద్యోగానికి వెళ్లింది. ఇంట్లో ఉన్న అపర్ణ తల్లిని చున్నీతో ఉరివేశాడు. అమ్మమ్మను ఎందుకు చంపుతున్నావ్ నాన్న అని ఆ చిన్నారి ఎంత ఏడ్చినా ఆ దుర్మార్గుడి మనసు కరగలేదు. చున్నీతో అపర్ణ తల్లిని చంపాడు. ఆతర్వాత బిడ్డ వైపు చూశాడు. ప్లీజ్ నాన్న నన్నేం చెయ్యద్దు అని ఎంత మొత్తుకున్నా వినలేదు. కడుపున పుట్టిన బిడ్డను కర్కశంగా చున్నీతో ఉరివేశాడు.

అప్పుడే ఇంట్లోకి వచ్చిన అపర్ణను కూడా చంపడానికి ప్రయత్నించాడు. పెనుగులాట జరగడంతో పక్కనే ఉన్న  రుబ్బురోలుతో అపర్ణతలపై 5 సార్లు మోదాడు. అపర్ణ కూడా అక్కడికక్కడే మృతిచెందింది. ముగ్గురిని పొట్టన పెట్టుకున్న తర్వాత పఠాన్‌చెరువులోని ఓ లాడ్జిలో గది తీసుకున్నాడు.  తన వెంట తెచ్చుకున్న కత్తితో చేతిపై గాట్లు పెట్టుకుని, క్రిమి సంహారక మందును తాగాడు. కానీ ఆత్మహత్య యత్నం బెడిసి కొట్టింది. దీనితో నేరుగా చందానగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.