రేప్ బాధితురాలిపై నోరు పారేసుకున్న బీజేపీ ఎంపీ - MicTv.in - Telugu News
mictv telugu

రేప్ బాధితురాలిపై నోరు పారేసుకున్న బీజేపీ ఎంపీ

November 30, 2017

బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ ఓ అత్యాచార బాధితురాలిపై అనుచిత  వ్యాఖ్యలు చేసింది. తప్పంతా బాధితురాలిదేనని చెప్పుకొచ్చింది. ఆమె అసలు రేపిస్టులు కూర్చున్న ఆటోలో ఆ అమ్మాయి ఎందుకెక్కిందని ఖేర్ ప్రశ్నించింది. దీనిపై దుమారం రేగుతోంది.చండీగడ్‌లో ఓ ఆటోడ్రైవర్ అతని స్నేహితులతో కలసి 22 ఏళ్ల యువతిని అత్యాచారం చేశారు. ఆ నియోజకవర్గం ఎంపీ అయిన కిరణ్ ఓ జాతీయ మీడియాతో బుధవారం మాట్లాడింది.  ‘ఆటోలో ముగ్గురు వ్యక్తులు ఉన్నప్పడు, ఆ అమ్మాయి  అప్రమత్తంగా ఉండి, ఆ ఆటో ఎక్కాల్సింది కాదు. అలాంటి సమయంలో అమ్మాయిలందరూ జాగ్రత్తగా ఉండాలి ’  అని అంది.

అమ్మాయిలకు తగిన సూచనలను చేయాల్సిన అవసరం తల్లిదండ్రులపై ఉందని ఆమె తెలిపారు. తాను ముంబైలో ఉన్న రోజుల్లో టాక్సీల్లో ప్రయాణించేదానినని, ఆ సమయంలో వాటి నంబర్లను రాసుకునే అలవాటు చేసుకున్నానని చెప్పుకొచ్చింది.  

కిరణ్ ఖేర్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి.ఒక మహిళ అయి ఉండి ఇలా మాట్లాడ్డం ఏంటని ప్రశ్నిస్తున్నాయి.  దాంతో ఈ విషయంపై కిరణ్ మరోసారి మీడియాతో మాట్లాడింది.  తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.  ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, మహిళలను చైతన్యపరిచేందుకే తాను ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని ,అంతే తప్ప కించపరిచే ఉద్దేశం తనకు లేదంది.  తాను కూడా ఓ మహిళనేనని అనవసరంగా  రాద్ధాంతం చేస్తున్నారని ఆమె మండిపడింది.