ప్రేమోన్మాదానికి బలైన చాందినీ జైన్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమోన్మాదానికి బలైన చాందినీ జైన్

September 13, 2017

చాందినీ జైన్ హత్య కేసు మిస్టరీ వీడింది. ఆమె స్నేహితుడు, ప్రియుడు అయిన సాయికిరణే ఆమెను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారణ చేసారు. ఎందుకు హత్య చేసాడని ప్రశ్నిస్తే తనను పెళ్ళి చేసుకొమ్మని వేధిస్తున్నదని చెప్పాడట. సాయికిరణ్ చాందినీ వాళ్ల ఇంటికి దగ్గర్లోనే వుంటాడట. చాలా కాలంగా వారిద్దరికీ స్నేహం వుంది. అలా వారి స్నేహం ప్రేమగా మారిందా అనే కోణంలో ఇంకా వివరాలు రాబట్టే పనిలో వున్నారు పోలీసులు. సెప్టెంబర్ 9 న ఇంటి నుండి బయటకు వెళ్ళిన చాందినీ జైన్ అమీన్ పూర్ గుట్టల్లో శవమై కనిపించింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు పైరవీ స్టార్ట్ చేసారు. తొలుత చాందినీది ఆత్మహత్యే అనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు చాందినీ సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదు అనేసరికి పోలీసులు తమ పైరవీని వేగవంతం చేశారు. శవం మెడ ఎడమ వైపు, కాలి మీద గాయాలుండటంతో ఖచ్చితంగా ఇది హత్యే అని నిర్ధారించి తన కాల్ డేటా ఆధారంగా సాయికిరణ్ ను పట్టుకొని అదుపులోకి తీస్కొని విచారించారు.

సిసి టీవి ఫుటేజ్ లో చాందినీ 9 తారీకు సాయంత్రం ఒక అబ్బాయితో అమీన్ పూర్ గుట్ట వైపు వెళ్ళడం రికార్డ్ అయింది. దాన్నిబట్టి పోలీసులకు ఈ మర్డర్ మిస్టరీని చేధించడానికి సులువైంది. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న అంతెత్తు కూతురు హత్యకు గురవడం ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. మియాపూర్ లోని మదీనాగూడాలో చాందినీ జైన్ కుటుంబం నివసిస్తోంది. వాళ్ళ నాన్నది బట్టల వ్యాపారం. ఆడపిల్లల స్నేహాల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వుండాలి. లేకపోతే ఎవడో అనామకుడి ప్రేమోన్మాదానికి కష్టపడి కని పెంచుకున్న కూతురును వాడి చేతుల్లో అంతమొందించుకోవాల్సి వస్తుంది. ఆడపిల్లలు కూడా అబ్బాయిలతో స్నేహాలు చేసే ముందు ఆలోచిస్తే బాగుంటుందంటున్నారు చాందినీ జైన్ ఇంటి చుట్టు పక్కలవాళ్ళు.