విద్యార్థులపై చంద్రబాబు గుస్సా - MicTv.in - Telugu News
mictv telugu

విద్యార్థులపై చంద్రబాబు గుస్సా

November 27, 2017

తమ సమస్యలను పరిష్కరించాలని  కోరిన ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత 28 రోజులుగా ఫాతిమా కాలేజీ విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోయేసరికి వారు గుణదలలోని  సెల్ టవర్ ఎక్కారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించడంతో.. పోలీసులు వారికి నచ్చజెప్పి, సీఎం అపాయింట్‌మెంట్ ఇప్పించారు.

వాళ్ళు అమరావతి వచ్చి తొలుత ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావును అసెంబ్లీ లాబీలో కలిసారు. తమకు న్యాయం చేయాలని మంత్రని కోరగా.. ఈ వ్యవహారం తమ చేతుల్లో లేదని, కాలేజీ మోసంపై సీఐడీ విచారణ జరుపుతామని చెప్పారు.  అసంతృప్తి  వ్యక్తం చేసిన విద్యార్థులకు, మంత్రికి నడుమ వాగ్వాదం జరిగింది.

అనంతరం విద్యార్థులు  సీఎంను కలిశారు.  ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంటే అల్లరి చేస్తారా ? అని బాబు  వారిపై మండిపడ్డారు. ‘మేం ఈ విషయంపై ఎంసీఐ, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం.. . ఆ విషయం తెలుసుకోకుండా మీరిలా సెల్ టవర్ ఎక్కి నానా రభస చేస్తారా ? అది చాలాదన్నట్టు మంత్రితో వాగ్వాదం పెట్టుకుంటారా ?’ అని గుస్సా అయ్యారు.  

సీఎం మాటలతో మరింత మనస్తాపం చెందారు విద్యార్థులు. ఎల్లుండి (బుధవారం) మంత్రి కామినేనితో కలిసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఢిల్లీ వెళ్లనున్నారు.