12 ఏళ్లలోపు పిల్లల్ని కాటేస్తే ఉరే.. కేంద్రం ఆర్డినెన్స్ - MicTv.in - Telugu News
mictv telugu

12 ఏళ్లలోపు పిల్లల్ని కాటేస్తే ఉరే.. కేంద్రం ఆర్డినెన్స్

April 21, 2018

మదమెక్కిన మృగాళ్ళ ఆట కట్టించటానికి చట్టాలు పదునెక్కుతున్నాయి. ఆడవాళ్ళ విషయంలో ఎవరు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా చట్టాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరిస్తున్నాయి. కథువా, ఉన్నావ్‌ అత్యాచార ఘటనలపై పెద్దఎత్తున దుమారం రేగుతోన్న వేళ పోక్సో చట్టానికి సవరణలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.  ఈ నేపథ్యంలో 12 ఏళ్ల లోపు వయస్సు కల్గిన చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణదండన విధించేలా కేంద్రం అత్యవసర ఆదేశం తీసుకొచ్చింది. కేంద్ర మంత్రిత్వ వర్గం అత్యవసరంగా ప్రధాని మోదీతో భేటి అయి కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పుడున్న పోక్సో చట్టంలో కీలక మార్పులు చేస్తున్నారు. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే ప్రస్తుత చట్టంలో కనిష్టంగా ఏడేళ్ళు, గరిష్టంగా జీవితఖైదు విధిస్తున్నారు. కాగా తాజా మార్పుల్లో లైంగిక చర్య తరువాత బాధితురాలు మరణిస్తే ముద్దాయికి మరణదండన విధించేలా మార్పు చేయనున్నారు. ఈ మేరకు వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో బిల్లు పెట్టాలని భావిస్తోంది. అప్పటివరకూ అమలులో ఉండేలా ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది.

పోక్సో చట్టానికి సంబంధించిన పూర్తి సవరణలపై చర్చించాక ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ అత్యవసర ఆర్డినెన్స్‌ను ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపించే అవకాశం ఉంది. పిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాల నుంచి రక్షించేందుకు పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్‌ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్) చట్టాన్ని 2012లో ప్రభుత్వం రూపొందించింది. 18సంవత్సరాలలోపు కలిగిన బాలురు/బాలికలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ చట్టం 2012, నవంబర్ 14 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం దేశమంతటికీ వర్తిస్తుంది.