పాక్ వగలాడికి వాయుసేన డేటా.. అధికారి అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

పాక్ వగలాడికి వాయుసేన డేటా.. అధికారి అరెస్ట్

February 9, 2018

సోషల్ మీడియా విషయంలో ఎంత స్వేచ్ఛ వుందో అంతకన్నా ఎక్కువ ప్రమాదాలు కూడా వున్నాయని ఈ సంఘటన రుజువు చేస్తోంది. సామాన్యులు పరవాలేదు గానీ కీలక బాధ్యత గల అధికారులు మాత్రం సోషల్ మీడియా విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి.  వైమానిక శాఖలో ఓ సీనియర్ ఐఏఎఫ్ అధికారి సోషల్ మీడియాలో పరిచయమైన యువతి వలలో పడిపోయి.. తమ శాఖ రహస్యాలన్నీ ఆ యువతికి వాట్సాప్ ద్వారా చేరవేశాడు. అతణ్ని వాయిసేన సస్పెండ్ చేసింది.   అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసి ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.

 ఎయిర్‌ఫోర్స్‌ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్న గ్రూప్‌ కెప్టెన్‌ ర్యాంక్‌ అధికారికి ఇటీవల ఓ యువతి సోషల్‌మీడియాలో పరిచయమైంది. చాటింగ్‌లతో వారి మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగింది. అతనితో చనువు పెంచుకున్న ఆ యువతి ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన కీలక విషయాలను అతణ్ణి అడుగుతూ రహస్యాలను రాబట్టుకుంది. అతను కూడా ఆమె మాయలో పడి అడిగినవన్నీ చెప్పేస్తూ వచ్చాడు. ఆయన ప్రవర్తనపై అనుమానం రావడంతో గతవారం కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ విభాగం అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారించారు.

వాయుసేన కీలక సమాచారాన్ని లీక్ చేశాడని విచారణలో తేలటంతో అతణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. తదుపరి విచారణను ఢిల్లీ పోలీసులు కొనసాగిస్తారని ఎయిర్‌ఫోర్స్‌ వర్గాలు వెల్లడించాయి. ఆ యువతి పాకిస్తాన్ గూఢాచారి అనే అనుమానం వ్యక్తమవుతోంది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరగడంతో ఆ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నేరం రుజువైతే అతనికి ఏడేళ్ల జైలుశిక్ష పడే అవకాశముంది.

కాగా సదరు అధికారి పేరు, వివరాలు వెల్లడించలేదు. కానీ కొన్ని ఆంగ్ల మీడియాల్లో మాత్రం అతని వివరాలు దచ్చీయా. గ్రూప్‌ కెప్టెన్‌గా పనిచేస్తున్న అరుణ్‌ మర్వాహా అనే అధికారిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నాయి. ఆయన ఫొటోను కూడా ప్రచురించాయి.