చెడ్డీగ్యాంగ్.. పగలు అడుక్కుంటారు.. రాత్రి దోచేస్తారు... - MicTv.in - Telugu News
mictv telugu

చెడ్డీగ్యాంగ్.. పగలు అడుక్కుంటారు.. రాత్రి దోచేస్తారు…

December 12, 2017

చైన్ స్నాచర్లు, దోపిడీ దొంగల గురించి చాలానే వినుంటారు. కానీ  ఈమధ్య చాలా నగరాల్లో వినిపిస్తున్న పేరు ‘చెడ్డీ గ్యాంగ్’. వేసుకునేది చెడ్డీలే…కానీ దోచుకున్నారంటే  అక్కడేమి మిగలదు. ఈమధ్యే హైదరాబాద్‌లోని ఘట్కేసర్ పరిసర ప్రాంతాల్లో ఈ చెడ్డీ గ్యాంగ్ సంచరించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వారికోసం రాచకొండ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ చెడ్డీ గ్యాంగ్ పగలు బిచ్చగాళ్లలా నటిస్తూ గల్లీ గల్లీ తిరిగి.. దోచుకునే ఇళ్లను, తాళాలు వేసిన ఇళ్లను గుర్తిస్తారు. ఇక రాత్రయ్యిందంటే చాలు ఒంటిమీద చెడ్డీ, బనియన్‌తో ప్రత్యక్షమై..ఒంటికి నూనె కాని ఒండ్రు మట్టిని గాని పూసుకుని..ముఖానికి మాస్కు తొడుక్కుని  దొంగతనానికి బయలుదేరతారు.  ఈ గ్యాంగ్‌లో సుమారు 6-10 మంది సభ్యులు ఉంటారు. అర్థరాత్రి ఎవరైనా ఒంటరిగా రోడ్డుపై కనిపిస్తే అంతే సంగతి..వాళ్లు నిలువుదోపిడి కావాల్సిందే. ఒకే రోజు మూడు, నాలుగు ఇండ్లను కూడా దోచేస్తారు. దోచేటప్పుడు ఇంటిలో ఎవరైనా ఉంటే చంపడానికి కూడా వెనుకాడరు. కత్తులు, రాడ్లు, బ్లేడ్లు మరియు తుపాకులు వీళ్ల ఆయుధాలు. ఈ చెడ్డీగ్యాంగ్ 1999వ సంవత్సరం నుండి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మద్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో దోపిడీలు చేస్తూ వస్తున్నారు. వీళ్లు పట్టుబడడం చాలా అరుదుగా జరుగుతుందట.  దొంగతనం చేసిన తర్వాత పోలీసులకు దొరక్కుండా చాలా చాక చాక్యంగా ప్లాన్ వేసుకుంటారు. చివరిసారిగా ఈ చెడ్డీ గ్యాంగ్ ను పోయిన సంవత్సరం ముంబై పోలీసులు పట్టుకున్నారు. అందుకే  అర్థరాత్రి  చెడ్డీ,బనియన్లతో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే  వెంటనే జాగ్రత్తపడి  పోలీసులకు సమాచారం అందించండి.