ఎంత కష్టం! అంత్యక్రియలకు డబ్బుల్లేక కొడుకు మృతదేహాన్ని.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎంత కష్టం! అంత్యక్రియలకు డబ్బుల్లేక కొడుకు మృతదేహాన్ని..

February 17, 2018

చేతికి అందివచ్చిన కొడుకు తనకు వృద్ధాప్యంలో చేదోడు వాదోడుగా ఉంటాడని భావించిన తల్లికి కడుపుకోతే మిగిలింది. ఈ విషాదానికి పేదరికం మరో విషాదాన్ని తోడు చేసింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన తన కొడుకు కర్మకాండలు చేయలేని స్థితికి ఆ బీదరాలిని నెట్టేసింది. ఈ బాధాకర సంఘటన ఛత్తీస్‌గఢ్ జరిగింది.  

బస్తర్ జిల్లాకు చెందిన బామన్ కూలిపనులు చేసుకుంటూ తన తల్లిని పోషించుకునేవాడు. ఈ నెల12న ఎప్పటిలాగే పనికి వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం అతడిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులు మృత్యువుతో పొరాడి చివరికి  కన్ను మూశాడు.

ప్రాణాలతో ఇంటికి వస్తాడనుకున్న కొడుకు మరణించడంతో అతని తల్లి  భోరున విలపించింది. బామన్‌ను  సొంత గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేయడానికి ఆమె దగ్గర చిల్లిగవ్వలేదు. సాయం కోసం ఎంతగానో ఎదురుచూసింది. కానీ ఎవరూ ఆపన్నహస్తం అందించలేదు. మృతదేహన్ని జగ్దల్‌పూర్‌‌ వైద్య కళాశాలకు అప్పజెప్పమని ఓ వ్యక్తి సలహా ఇచ్చాడు. దీనికి మొదట ఆమె నిరాకరించింది. అయితే విధిలేని పరిస్థితుల్లో తన బిడ్డ మృతదేహాన్ని కాలేజీకి అప్పగించింది.