కన్నబిడ్డ అంత కక్కస్తే..ఎందుకు కన్నావురా...? - MicTv.in - Telugu News
mictv telugu

కన్నబిడ్డ అంత కక్కస్తే..ఎందుకు కన్నావురా…?

March 1, 2018

తల్లి తన బిడ్డలను నవమాసాలు మోస్తే..తండ్రి ఆ  పిల్లల భవిష్యత్తుకోసం వాళ్లను మైండ్‌లో  కొన్ని సంవత్సరాలు మోస్తాడంటారు. అంత గొప్ప స్థానం ఉంది నాన్న అనే పదానికి. నాన్న అనే పిలుపుకోసం  పరితపించిపోతుంటారు చాలామంది. పిల్లల ముద్దు ముద్దు మాటలు, చేష్టలు చూసి మురిసిపోతుంటారు నాన్నలు. కానీ చైనాలో ఓ వ్యక్తి మాత్రం  కన్న కూతురిని  దారుణంగా హింసించాడు. ఆ చిట్టి తల్లి చేసిన తప్పేంటో తెలుసా? నన్నూ బయటకు తీసుకుపో అని నాన్న వెంబట పడడం.


చైనాలోని ఘ్వాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన వియ్‌ అనే వ్యక్తి బైక్ పై బయటకు వెళుతున్నాడు. ఇంతలో తన 10 ఏళ్ల కూతురు నాన్న నాన్న నేను కూడా వస్తాను అని మారాం చేసింది. దీనితో చిర్రెత్తిపోయిన ఆ తండ్రి  బిడ్డ కాళ్లు,చేతులు కట్టేసి  కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు.

అంతేకాదు బిడ్డను బైక్ వెనకాల కట్టేసి  బైక్ నడిపిస్తూ ఈడ్చుకుంటూ వెళ్లాడు..ఆ పసి పాప ఎంత ఏడ్చినా పట్టించుకోకుండా  రాక్షసంగా ప్రవర్తించాడు. చుట్టు ప్రక్కల వారు కూడా అయ్యో అని అనుకున్నారే తప్ప ఒక్కరు కూడా ఆ దారుణాన్ని ఆపే ప్రయత్రం చేయలేదు. అక్కడున్న ఓవ్యక్తి మాత్రం దాన్ని వీడియో తీసి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ కసాయి తండ్రిని అరెస్ట్ చేసి  చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. బాలల వేధింపుల చట్టం కింద వియ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లిదండ్రులు  బైటికి వెళుతున్నప్పుడు సాధారణంగా పిల్లలు నేను కూడా వస్తాను అని మారాం చేస్తారు. వద్దు బిడ్డా అని కొందరు సముదాయిస్తారు లేకపోతే తమతో పాటుగా తీసుకెళ్తారు.  అంతే గాని ఈ కసాయి తండ్రి చేసినట్టు మాత్రం ఎవ్వరూ చెయ్యరు. అందుకే  వీన్ని చూసిన వాళ్లందరూ  కన్నబిడ్డ అంత కక్కస్తే ఎందుకు కన్నావురా? అని ప్రశ్నిస్తున్నారు.