నల్గొండ టూటౌన్ సీఐ మిస్సింగ్.. - MicTv.in - Telugu News
mictv telugu

నల్గొండ టూటౌన్ సీఐ మిస్సింగ్..

February 2, 2018

‘శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసుల నిర్లక్ష్యం వల్లే నల్లగొండలో రెండు హత్యలు జరిగాయం’టూ ఉన్నతాధికారులు మందలించడాన్ని జీర్ణించుకోలేని నల్లగొండ రెండో పట్టణ ఠాణా సీఐ వెంకటేశర్లను కనిపించకుండా పోయారు.   తీవ్ర మనస్తాపానికి గురై  తన రెండు సెల్‌ఫోన్లు, రివాల్వర్‌ను పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్పి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.  ఆయన ఎక్కడికి వెళ్ళిందీ తెలియడ లేదు. వ్యక్తిగత సెల్‌ఫోన్ నంబర్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది.  ఓవైపు రాజకీయ ఒత్తిళ్ళు, మరో వైపు ఉన్నతాధికారుల నుంచి మందలింపులు రావటంతో మనస్తాపానికి గురై ఇలా వెళ్లిపోయుంటాడనే పుకార్లు వినిపిస్తున్నాయి.  రెండు కేసులతో గత పది రోజులుగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య, కనగల్లుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.  శ్రీనివాస్ హత్య కేసులో  పోలీసులు 11 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందులో ఎ6, ఎ11 నిందితులకు నిన్న న్యాయస్థానం రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. 

తొలుత నుంచీ ఈ కేసులో పోలీసుల తీరు అనుమానాస్పదంగానే వుందనే విమర్శలు వినబడుతున్నాయి. కాగా బాధ్యత కలిగిన సీఐ ఇలా పత్తా లేకుండా అండర్ గ్రౌండ్‌లోకి వెళ్ళడమేంటోనని అనుకుంటున్నారు.

రెండ్రోజుల క్రితం సెలవు అడిగినట్లు తెలుస్తోంది. కానీ ఇంతటి కీలక పరిస్థితుల్లో సెలవుపై ఎలా వెళ్తావంటూ ఉన్నతాధికారులు నిరాకరించడంతో కేసుల పట్ల సరిగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.