సమ్మక్క, సారక్క వద్ద  కేసీఆర్  కోరిక ఇదే.. - MicTv.in - Telugu News
mictv telugu

సమ్మక్క, సారక్క వద్ద  కేసీఆర్  కోరిక ఇదే..

February 2, 2018

మేడారం జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సీఎం కేసీఆర్. ఆరేళ్ల తరువాత జాతరకు వెళ్లిన ఆయన  కుటుంబ సమేతంగా  సమ్మక్క సారలమ్మలను దర్శించుకొన్నారు. ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం, పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం సతీమణి శోభ, మనవడు హిమాన్షు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు అమ్మవార్లను దర్శించుకున్నారు.

సీఎం గద్దెల వద్దకు బంగారాన్ని మోసుకెళ్లి వనదేవతలకు సమర్పించారు. కుటుంబసమేతంగా పగిడిద్దరాజు, గోవిందరాజులకు మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మేడారంలో శాశ్వత ఏర్పాట్ల కోసం 200 వందల ఎకరాల  భూసేకరణ చేస్తామని వాగ్దానం చేశారు. ఏర్పాట్ల కోసం ప్రభుత్వం తరఫున రూ. 200 కోట్లు మంజూరు చేసి, జంపన్న వాగులో స్నానాల కోసం మరో డ్యాంను నిర్మిస్తామని ప్రకటించారు. మేడారం జాతరను జాతీయ పండగగా గుర్తించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవిస్తానన్నారు.

తెలంగాణలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులు తొందరగా పూర్తయ్యేలా చూడాలని, వాటికి ఆటంకాలు రాకుండా చూడాలని అమ్మవార్లను కోరుకున్నట్లు సీఎం కేసీఆర్ అన్నారు. ఆరేళ్ల కిందట వీరిని దర్శించుకున్నప్పుడు రాష్ట్ర సాధన కోరుకున్నానన్నారు.

కాగా మేడారం జాతరకు కిక్కిరిసి భక్తులు తరలి రావడంతో కోలాహల వాతావరణం నెలకొని వున్నది. ఇదే అదనుగా జేబు దొంగలు చెలరేగిపోతున్నారని భక్తులు వాపోతున్నారు. పర్సులు, ఆడవాళ్ళ మెడల్లోంచి బంగారు నగలు మాయమవుతున్నట్టు సమాచారం. భద్రతా ఏర్పాట్లలో, వైద్యం, ట్రాఫిక్ వంటి సదుపాయాలను సమకూర్చడంలో అధికార యంత్రాంగం విఫలమైనట్టు చెబుతున్నారు. ఇదిలా వుండగా మేడారం అమ్మవార్లను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా దర్శించుకోవడం విశేషంగా మారింది.