మా ఇంట్లో ఉందువురా అమ్మా.. కలెక్టర్ రొనాల్డ్ - MicTv.in - Telugu News
mictv telugu

మా ఇంట్లో ఉందువురా అమ్మా.. కలెక్టర్ రొనాల్డ్

February 27, 2018

మహబూబ్ నగర్ కలెక్టర్ రొనాల్డ్ రాస్.. మేకలు కాసే పిల్లలను బడికి తీసుకెళ్లి అప్పగించం తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. గూడు లేని ఒక ముసలమ్మను ‘మా ఇంట్లో ఉందువుగాని రామ్మా..’ అని కోరారు.  సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఈ భావోద్వేగ సంఘటన చోటుచేసుకుంది.కలెక్టర్ ప్రజల  నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరిస్తుండగా బండ్లగురి ప్రాంతానికి చెందిన ఆర్ సోనాబాయ్ నడవలేని స్థితిలో చేతి కర్ర సాయంతో వచ్చింది. ఆమెను చూడగానే కలెక్టర్ చాలా ఆప్యాయంగా పలకరించారు. సమస్య ఏమింటని అడిగారు. ‘కొన్నేళ్లుగా నేను, నా కొడుకు అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఇంటి యాజమమాని ఇంటిని  ఖాళీ చేయాలని హెచ్చరిస్తున్నాడు. ఇప్పటికప్పుడు ఖాళీ చేసి ఎక్కడికెళ్తాం బిడ్డా? కొంచెం సమయం ఇవ్వమని నువ్వైనా చెప్పు’ అంటూ  వేడుకుంది.

దాంతో చలించిపోయిన కలెక్టర్‌.. ‘మా ఇంట్లో ఉందువురా అమ్మా.. నీ కెలాంటి ఇబ్బందీ ఉండదు. అన్నీ నేను చూసుకుంటాను’ అని చెప్పారు. అయితే, ఆ వృద్ధురాలు మాత్రం ‘నీకెందుకు కష్టం బిడ్డా.. కొన్నిరోజులు ఆ ఇంట్లోనే ఉండేలా యజమానికి చెప్పు’ అని కోరింది. కలెక్టర్‌ వెంటనే సోనాబాయికి కొంత గడువు ఇచ్చేలా యజమానితో మాట్లాడాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించడంతో ఆమె ‘నువ్వు సల్లంగా ఉండు బిడ్డా’ అంటూ ఆనందంగా సోనాబాయ్  వెళ్లిపోయింది.